పచ్చమూకల బరితెగింపు | TDP goons wreak violence across the state during Panchayat elections | Sakshi
Sakshi News home page

పచ్చమూకల బరితెగింపు

Nov 21 2026 4:32 AM | Updated on Nov 21 2026 4:32 AM

TDP goons wreak violence across the state during Panchayat elections

తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంటి వద్ద టీడీపీ గూండాలు నిప్పు పెట్టడంతో తగలబడుతున్న వాహనం

ఓటుకు ముందే.. ఓటమి భయం

పల్లె పోరులోనూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ గూండాల హింసాకాండ

విపక్షం నామినేషన్‌ వేస్తే దాడులు.. పోటీ చేస్తే కిడ్నాప్‌లు 

తెగబడి పత్రాలు లాక్కుని చించేస్తున్న పచ్చముఠాలు 

కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై హత్యాయత్నాలు 

తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంటిపై దాడి.. 4 కార్లు.. 14 బైక్‌లు దగ్ధం 

ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై పెట్రోల్‌ బాంబులతో దాడి  

ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డిలపై ఆంక్షలు 

చంద్రగిరిలో పోలీసుల సమక్షంలోనే అభ్యర్థి రాజేంద్రనాయుడు కిడ్నాప్‌ 

తాడేపల్లిగూడెంలో మున్సిపల్‌ వార్డు అభ్యర్థి ఇంటికి నిప్పు 

మార్కాపురం జిల్లా కొమరోలులో మహిళా అభ్యర్థి కంట్లో కారం చల్లి పైశాచికం

మున్సిపల్, పరిషత్‌ ఎన్నికల మాదిరిగానే పల్లె పోరులోనూ విపక్షం కనీసం నామినేషన్‌ కూడా వేయకుండా అడ్డుకోవడం.. నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించేయడం.. అభ్యర్థుల కిడ్నాప్‌.. ఇళ్లపై పెట్రోల్‌ బాంబులు విసరడం.. వాహనాలకు నిప్పంటించడం లాంటి అరాచకాలకు పచ్చ ముఠాలు తెగబడ్డాయి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారం అండతో టీడీపీ రౌడీమూకలు హింసాత్మక చర్యలకు దిగాయి. వైఎస్సార్‌ కడప జిల్లాలో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిపై, అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై హత్యాయత్నాలకు పాల్పడటం పచ్చమూకల కిరాతకాలకు పరాకాష్ట.

సాక్షి, అమరావతి, నెట్‌వర్క్‌: పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతో ఓటుకు ముందే పచ్చమూకలు బరితెగించి దౌర్జన్యాలకు దిగాయి. ఎన్నికల్లో ప్రత్యర్థులను ప్రజాక్షేత్రంలో రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నాయి. అధికార టీడీపీ కూటమి నేతల అండతోనే ఈ అరాచకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు, ఎన్నికల అధికారులు ప్రేక్షకపాత్ర వహించడం విభ్రాంతి కలిగిస్తోంది. 

వైఎస్సార్‌ కడప జిల్లా, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, పల్నాడు, పశ్చిమ గోదావరి తదితర జిల్లాల్లో స్థానిక ఎన్నికల వేళ శుక్రవారం టీడీపీ గూండాలు పేట్రేగిపోవడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైఎస్సార్‌ కడప జిల్లాలో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిపైన, అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపైన హత్యాయత్నాలకు ఒడిగట్టడం, పెద్దారెడ్డి ఇంటి వద్ద 4 కార్లు, 14 బైక్‌లు దహనం చేయడం పచ్చ మూకల బరితెగింపునకు పరాకాష్టగా నిలుస్తోంది. 

వైఎస్సార్‌ జిల్లా అంకాలమ్మగూడూరులో ఎంపీ అవినాశ్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లు, పెట్రో బాంబులతో దాడి చేస్తున్న టీడీపీ రౌడీలు    

మంత్రి ఆనం ఇలాకాలో ఆంక్షల రాజ్యం 
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. దీంతో మర్రిపాడు మండలం సింగనపల్లి గ్రామ సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డిలను నామినేషన్‌ కేంద్రాల వద్దకు రావద్దంటూ ఆంక్షలు విధించారు. మరోవైపు నామినేషన్‌ కేంద్రాల వద్ద టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. అదే నియోజకవర్గం గోపవరంలో వైఎస్సార్‌సీపీకి చెందిన కాశిరెడ్డి నామినేషన్‌ పత్రాలను టీడీపీ కార్యకర్తలు చించివేశారు.  

పల్నాడులో దాడులకు ఖాకీల వత్తాసు
పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు లాక్కున్న టీడీపీ మూకలు రాష్ట్రంలో తమ ప్రభుత్వమే ఉందంటూ బెదిరింపులకు దిగాయి. పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం మన్నె సుల్తాన్‌పాలెంలో వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌ అభ్యర్థి కంపు ఆంజనేయులు నామినేషన్‌ పత్రాలను టీడీపీ నాయకులు లాక్కొని చించేశారు. ‘మీ ప్రభుత్వం వచ్చినప్పుడు చూసుకోండి.. ఇప్పుడు మా ప్రభుత్వమే ఉంది.. మీరు నామినేషన్‌ వేయడానికి వీల్లేదు’ అంటూ హెచ్చరించారు. పల్నాడు వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టాన్ని పచ్చ మూకలు ఖూనీ చేశాయి. 

    పల్నాడు జిల్లా కొమెరపూడిలో నామినేషన్‌ కేంద్రం వద్ద మహిళలను అడ్డుకుంటున్న పోలీసులు  

విపక్ష అభ్యర్థులు,  వారి కుటుంబ సభ్యులను అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరిస్తూ దౌర్జన్యాలకు దిగాయి. కూటమి నేతల కుట్రలు, పోలీసుల బెదిరింపులు నేపథ్యంలో పెదకూరపాడు నియోజకవర్గంలోని 76 పంచాయతీలకుగాను 11 పంచాయతీల్లో మాత్రమే వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు నామినేషన్లు వేసే అవకాశాన్ని కల్పించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సెక్షన్‌ 324 కింద కేసులు నమోదు చేయగా.. ఎక్కడైనా నామినేషన్‌ దాఖలు చేస్తే 307 కిందకు మార్చి కేసులు పెట్టి  రౌడీషీట్లు తెరుస్తామని పోలీసులు హెచ్చరికలు చేశారు. 

సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు సర్పంచ్‌ అభ్యర్థి, వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు అతిపట్ల శ్రీనివాసరావును సత్తెనపల్లి రూరల్‌ సీఐ రాంబాబు ఆదేశాలతో ఇద్దరు కానిస్టేబుళ్లు లాక్కెళ్లే యత్నం చేశారు. అనంతరం ఆయన నామినేషన్‌ దాఖలు చేసేందుకు కొమెరపూడి రాగా కూటమి నేతలు కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, మద్దతుదారులు అక్కడకు పెద్దఎత్తున చేరుకోవడంతో శ్రీనివాసరావును విడిచిపెట్టారు. 

శ్రీనివాసరావు నామినేషన్‌ దాఖలు చేయకుండా సీఐ రాంబాబు అడ్డుకోగా.. అనంతరం సంతకాలు లేవంటూ నామినేషన్‌ కేంద్రంలో ఎన్నికల అధికారులు మెలిక పెట్టడంతో హైడ్రామా నడిచింది. ఈ క్రమంలో కొమెరపూడి నామినేషన్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చివరకు అత్తిపట్ల శ్రీనివాసరావు లక్కరాజు గార్లపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశాడు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం గింజుపల్లికి చెందిన జనసేన అభ్యర్థి బాణావత్‌ పద్మాబాయి నామినేషన్‌ పత్రాలను టీడీపీ వర్గీయులు లాక్కున్నట్లు చెబుతున్నారు. 

చంద్రగిరిలో పోలీసుల ఎదుటే అభ్యర్థి కిడ్నాప్‌..  
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగలో పోలీసుల ఎదుటే కిడ్నాప్‌ ఘటన తీవ్ర కలకలం రేపింది.  వైఎస్సార్‌సీపీ మద్దతుతో సర్పంచ్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న రాజేంద్రనాయుడును టీడీపీ వర్గీయులు కిడ్నాప్‌ చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. గత ఐదు రోజులుగా ధ్రువపత్రాలు ఇవ్వకుండా అధికారులు అడ్డుకున్నారని, ఎలాగోలా పత్రాలు సిద్ధం చేసుకుని గురువారం నామినేషన్‌ కేంద్రానికి వెళ్లిన రాజేంద్రనాయుడుకు 34వ నంబరు టోకెన్‌ ఇచ్చి వేచి ఉండమన్నారని తెలిపారు. 

              తిరుపతి మంగళంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను అడ్డుకున్న పచ్చమూకలు  

ఆ తర్వాత నామినేషన్‌ స్వీకరించకుండానే ఆర్‌ఓ బాలాజీ, రామచంద్రాపురం ఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్‌ కలసి బలవంతంగా బయటకు పంపించారన్నారు. నామినేషన్‌ వేస్తే చంపేస్తామంటూ పచ్చమూకలు హెచ్చరించాయి. శుక్రవారం మరోసారి నామినేషన్‌ కేంద్రానికి వెళ్లిన రాజేంద్రనాయుడును అడ్డుకుని ఏపీ 03 టీకే 2318 ఇన్నోవా వాహనంలో కిడ్నాప్‌ చేశారని ఆయన కుమారులు అరుణ్‌కుమార్, కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు. పోలీసులు చూస్తుండగానే ఈ ఘటన జరిగినా అడ్డుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎస్సై భక్తవత్సలం ముందుగానే తన రాక సమాచారాన్ని టీడీపీ వర్గీయులకు అందించారని చెప్పారు. టీడీపీకి చెందిన నారా ఉదయ్, వేణులతో పాటు మరికొందరిపై చంద్రగిరి డీఎస్పీ జగదీష్‌ నాయక్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించి కారు సహా ఆధారాలను రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా అధికారులతో పాటు హైకోర్టుకు సమర్పిస్తామని వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ప్రకటించారు. పోలీసుల తీరుపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. 

మాజీ ఎమ్మెల్యే లలితకుమారి కారు ధ్వంసం
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం–నల్లగాంపల్లిలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై టీడీపీ మూకలు రాళ్లు, కర్రలతో దాడులకు దిగాయి. నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న అభ్యర్ధులను అడ్డగించారు. టీడీపీ రాళ్ల దాడిలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు గాయాలయ్యాయి. ఈ దాడిలో మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి కారును సైతం పచ్చమూక ధ్వంసం చేసింది.  

పచ్చమూకల స్వైరవిహారం
మార్కాపురం జిల్లా కొమరోలులో నామినేషన్‌కు వేసేందుకు వచ్చిన అభ్యర్ధులపై టీడీపీ రౌడీలు దాడులకు తెగబడి పత్రాలు లాక్కొని చించివేశారు. వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరురాలైన మహిళా అభ్యర్థిని అడ్డుకుని కంట్లో కారం చల్లారు. 

మార్కాపురం జిల్లా కొమరోలులో వైఎస్సార్‌ సీపీ బలపరచిన అభ్యర్థులపై లాఠీచార్జ్‌ చేస్తున్న పోలీసులు  

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం కొసమాలలో సర్పంచ్‌ అభ్యర్థి శిష్టు లక్ష్మీ నామినేషన్‌ను టీడీపీ కుట్రలతో అడ్డుకుంది. వార్డు మెంబర్లుగా నామినేషన్‌ వేసేందుకు ఆమెతో కలసి వెళుతున్న జొన్న ముద్దమ్మ, వట్టికుళ్ల రాజేశ్వరి, ఉర్లాన నీలవేణి, శ్రీరాం ప్రశాంత్, అంధవరపు ఇందిరమ్మను పచ్చమూకలు అడ్డగించాయి. సర్పంచ్‌ అభ్యర్థి లక్ష్మి చేతిలోని ధ్రువీకరణ పత్రాలను చింపేసి మహిళ అని కూడా చూడకుండా తోసేశారు. సమయం అయిపోయిందనే నెపంతో సర్పంచ్‌ అభ్యర్థిగా తన నామినేషన్‌ తిరస్కరించినట్లు శిష్టు లక్ష్మీ పేర్కొంది. తాను వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీ చేస్తున్నానని తెలిపింది.  

            శ్రీకాకుళం జిల్లా కొసమాలలో టీడీపీ రౌడీలు నామినేషన్‌ పత్రాలు చించేశారని ఆందోళన 

అన్నమయ్య జిల్లా సోమల మండలం పెద్ద ఉప్పరపల్లిలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై టీడీపీ గూండాలు దాడి చేసి నామినేషన్‌ పత్రాలను అపహరించారు. 

వైఎస్సార్‌ కడప జిల్లాలో ఖాకీల ఆంక్షలు కొనసాగాయి. పందిళ్లపల్లె కేంద్రం వద్దకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వెల్లటూరులోనూ ఉద్రిక్తత చోటుచేసుకుంది. బద్వేలు సాక్షి టీవీ రిపోర్టర్‌పై దాడిని ఖండిస్తూ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. 

వైఎస్సార్‌ కడప జిల్లా వేంపల్లెలో టీడీపీ దురాగతాలపై పోలీస్‌స్టేషన్‌ ఎదుట నామినేషన్‌ పత్రాలతో నిరసన తెలుపుతున్న సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులు 

పులివెందుల నియోజకవర్గంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళుతున్న తమపై సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరు వద్ద టీడీపీ నాయకులు అడ్డుకుని పెట్రోలు బాంబులు, రాళ్లతో దాడికి పాల్పడ్డారని ఆ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌ అభ్యర్థులు పేర్కొన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తాము నామినేషన్లు దాఖలు చేసి తిరిగి సురక్షితంగా వెళ్లేలా పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు పులివెందుల డీఎస్పీకి తక్షణం ఆదేశాలు జారీ చేయాలని, నిందితులపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. సింహాద్రిపురం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌ అభ్యర్థులు కె.లక్ష్మయ్య, నాదెండ్ల సలీమా, మెమ్మర్ల రవి, నాగజ్యోతి, పుప్పాల బాబ్జిరెడ్డి, అచ్చుకట్ల మహబూబ్‌జాన్, కొర్నేర కొండయ్య, ఉసిరెడ్డిగారి రోహిణి తదితరులు ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీలకు విన్నవించారు.

నామినేషన్లు అడ్డుకోవడంతో ఆగిన గుండె! 
పల్నాడు జిల్లా జూపూడిలో విషాదం 
స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒకరు గుండె ఆగి మృతి చెందాడు. పల్నాడు జిల్లా అమరావతి మండలం జూపూడిలో ఈ విషాదం చోటు చేసుకుంది. జూపూడి వైఎస్సార్‌ సీపీకి గట్టి పట్టున్న గ్రామం.  జూపూడికి చెందిన జెట్టి జ్ఞానయ్య (69) వైఎస్సార్‌ సీపీకి వీరాభిమాని. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.

జూపూడి ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్‌ పదవులను టీడీపీ దౌర్జన్యంగా కైవశం చేసుకోవడంతో రెండు రోజులుగా ఆయన దిగాలుగా ఉంటున్నాడు. జై జగన్‌ అని నినదిస్తూ గ్రామంలో తిరుగుతూ శుక్రవారం ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. జ్ఞానయ్య మృతదేహాన్ని పెదకూరపాడు నియోజకవర్గ మహిళా నాయకురాలు నంబూరు వసంతకుమారి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు నంబూరు బాబురావు, జెట్టి నాగరాజు, అన్నపాములు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెంలో అభ్యర్థి ఇంటికి నిప్పు.. 
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. 38వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నల్లగొండ స్వప్న ఇంటికి అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారని బాధిత కుటుంబం ఆరోపించింది. నామినేషన్‌ ఉపసంహరించుకునేందుకు అంగీకరించకపోవడంతో జనసేన నేతలు ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొంది.

స్థానికులు అప్రమత్తం చేయడంతో ప్రాణాపాయం తప్పింది. కట్టుబట్టలతో రోడ్డున పడిన కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వడ్డి రఘురామ్‌నాయుడు పరామర్శించారు. నామినేషన్ల ఉపసంహరణకు అధికారుల నుంచి ఫోన్లు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. సంతకాలు లేకుండానే ఉపసంహరణలు జరిగినట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా ఫిర్యాదులు స్వీకరించడం లేదని విమర్శించారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement