అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో రికార్డు స్థాయిలకు చేరిన ఈ విలువైన లోహాలు ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. జనవరిలో ఔన్స్ బంగారం ధర 5,599 డాలర్ల గరిష్ఠాన్ని తాకగా, ప్రస్తుతం 3,778 డాలర్ల స్థాయికి పడిపోయింది. అంటే దాదాపు 32 శాతం క్షీణించింది. ఇక వెండి ధర 121.65 డాలర్ల రికార్డు గరిష్ఠం నుంచి 46 డాలర్లకు దిగివచ్చింది. ఈ లెక్కన ఏకంగా 62 శాతం పతనమైంది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై మారుతున్న అంచనాలు ఈ పతనానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. అమెరికా డాలర్ బలపడటం, బాండ్ ఈల్డ్స్ పెరగడంతో వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం, వెండిపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గుతోంది. ముఖ్యంగా డిసెంబరులో ఫెడ్ మరోసారి 0.25 శాతం వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు బులియన్ మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి. నవంబర్ 18 నాటి అంతర్జాతీయ మార్కెట్ గణాంకాల ప్రకారం, డిసెంబర్‌లో పావు శాతం రేట్ల పెంపునకు 95 శాతం అవకాశముందని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి.
చమురు ధరల సెగ
క్రూడాయిల్ ధరల పరిణామాలు కూడా ఇప్పుడు విలువైన లోహాల మార్కెట్‌కు కీలకంగా మారాయి. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణ భయాలు అధికమవుతాయి. దీంతో బాండ్ ఈల్డ్స్, డాలర్ బలపడే అవకాశాలుంటాయి. ఫలితంగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్లు చమురు ధరల దిశను కూడా నిశితంగా గమనిస్తున్నాయి.
మరోవైపు వెండి పారిశ్రామిక డిమాండ్‌లో మార్పులు కనిపిస్తున్నాయి. సిల్వర్ ఇన్‌స్టిట్యూట్ నవంబర్ 12న విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం.. 2026లో పారిశ్రామికంగా వెండి వినియోగం 3 శాతం తగ్గి 640 మిలియన్ ఔన్సులకు చేరవచ్చు. ముఖ్యంగా సౌర విద్యుత్ ప్యానళ్ల తయారీలో వెండి వినియోగాన్ని తగ్గించడం, ఇతర పదార్థాలతో ప్రత్యామ్నాయం చేయడం దీనికి కారణం. అయితే సౌర విద్యుత్ రంగం మినహా ఇతర పరిశ్రమల్లో డిమాండ్ 4.5 శాతం పెరగవచ్చని అంచనా. ఈ ఏడాది గనుల నుంచి వెండి ఉత్పత్తి 0.5 శాతం తగ్గి 834 మిలియన్ ఔన్సులకు చేరవచ్చని, ఫలితంగా 35 మిలియన్ ఔన్సుల సరఫరా లోటు ఏర్పడవచ్చని సంస్థ పేర్కొంది.
అయితే బంగారానికి దీర్ఘకాలికంగా మద్దతునిచ్చే అంశాలు ఇంకా బలంగానే ఉన్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నవంబర్ 3న విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2026 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ప్రపంచ కేంద్ర బ్యాంకులు 675 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఒక్క మూడో త్రైమాసికంలోనే 321 టన్నులు జోడించాయి. ఇదే సమయంలో గ్లోబల్ గోల్డ్ ఈటీఎఫ్‌లలో మూడో త్రైమాసికంలో 211.2 టన్నుల పెట్టుబడులు వచ్చాయి. రెండో త్రైమాసికంలో నమోదైన అమ్మకాల తర్వాత ఇది గణనీయమైన మార్పు.
దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరల పతనం ఇలా..
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


