షేర్ ట్రేడింగ్‌పై ట్యాక్స్‌ 50% తగ్గించే యోచన! | Budget 2027 STT half cut LTCG STCG tax relief What government considering | Sakshi
Sakshi News home page

షేర్ ట్రేడింగ్‌పై ట్యాక్స్‌ 50% తగ్గించే యోచన!

Nov 18 2026 7:57 PM | Updated on Nov 18 2026 8:04 PM

Budget 2027 STT half cut LTCG STCG tax relief What government considering

స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక పన్ను మార్పులను పరిశీలిస్తోంది. షేర్ల కొనుగోలు, విక్రయాలపై విధించే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌ (STT)ను 50 శాతం తగ్గించే ప్రతిపాదన ఇందులో ఉంది. అదే సమయంలో ఫ్యూచర్స్, ఆప్షన్స్ వంటి డెరివేటివ్స్ ట్రేడింగ్‌పై పన్నులను మరింత పెంచే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. నగదు మార్కెట్‌లో పెట్టుబడులను ప్రోత్సహించడం, అధిక రిస్క్‌తో కూడిన ఊహాజనిత ట్రేడింగ్‌ను నియంత్రించడం ఈ ప్రతిపాదనల లక్ష్యంగా తెలుస్తోంది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌ 2027లో ఈ అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలను పరిశీలిస్తున్నారు. తుది సిఫార్సులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమర్పించనున్నారు. మూలధన లాభాల పన్ను (LTCG) విధానంలోనూ మార్పులు చేయాలన్న ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

డెరివేటివ్స్‌లో భారీ నష్టాలు.. మార్పులకు కారణమిదే!

డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతుండటం ప్రభుత్వ ఆందోళనకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సెబీ విడుదల చేసిన 2025–26 ఆర్థిక సంవత్సరం నివేదిక ప్రకారం, ఈక్విటీ డెరివేటివ్స్‌లో ట్రేడింగ్ చేసిన వ్యక్తిగత ఇన్వెస్టర్లలో సుమారు 87.7 శాతం మంది నష్టాలు చవిచూశారు. వారి మొత్తం నష్టాలు దాదాపు రూ.91,685 కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో ఆప్షన్స్ ట్రేడింగ్ వాటానే 92 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో డెరివేటివ్స్‌పై పన్నులు పెంచడం ద్వారా అనవసరమైన స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌ను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎల్‌టీసీజీ పన్ను తగ్గించాలన్న డిమాండ్

మరోవైపు, ఈక్విటీ పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (LTCG) తగ్గించాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ (FICCI) ప్రతినిధులు ఇటీవల ఆర్థిక మంత్రిని కలిసి, లిస్టెడ్ షేర్లపై ఎల్‌టీసీజీ పన్ను మినహాయింపును తిరిగి తీసుకురావాలని ప్రతిపాదించారు. ప్రత్యామ్నాయంగా, పెట్టుబడి కాలాన్ని బట్టి 10 శాతం, 5 శాతం, సున్నా శాతం చొప్పున పన్ను విధించే విధానాన్ని సూచించారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగకుండా డెలివరీ ఆధారిత లావాదేవీలపై ఎస్టీటీని కొంత పెంచవచ్చని కూడా పేర్కొన్నారు.

గతంలో 2004లో అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఎల్‌టీసీజీ పన్నును తొలగించి ఎస్టీటీని ప్రవేశపెట్టారు. అయితే, 2018లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎల్‌టీసీజీ పన్నును తిరిగి అమల్లోకి తెచ్చారు.

ప్రస్తుతం పన్నులెంత?

ప్రస్తుతం గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టెడ్ ఈక్విటీ షేర్లు, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లపై అర్హత కలిగిన దీర్ఘకాలిక లాభాలు ఏడాదికి రూ.1.25 లక్షలు దాటితే 12.5 శాతం ఎల్‌టీసీజీ పన్ను చెల్లించాలి. స్వల్పకాలిక లాభాలపై 20 శాతం పన్ను వర్తిస్తుంది.

ఇక 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పుల ప్రకారం.. ఫ్యూచర్స్ విక్రయాలపై ఎస్టీటీ 0.02 శాతం నుంచి 0.05 శాతానికి, ఆప్షన్స్ ప్రీమియంపై 0.10 శాతం నుంచి 0.15 శాతానికి పెరిగింది. ఆప్షన్ వినియోగించినప్పుడు విధించే పన్ను 0.125 శాతం నుంచి 0.15 శాతానికి చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement