లోక్‌సభలో కేంద్రం స్పష్టత
ఈక్విటీ షేర్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులపై విధిస్తున్న దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్‌టీసీజీ) పన్నును ఎత్తివేసే ఆలోచన ఏదీ ప్రస్తుతం పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతికూల మార్కెట్ వార్తలు, నిపుణుల అంచనాల నడుమ పెట్టుబడిదారుల్లో నెలకొన్న ఊహాగానాలకు తెరదించుతూ లోక్‌సభలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.
పార్లమెంట్ ఉభయసభల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానమిస్తూ.. పన్ను విధానాలు, మూలధన లాభాల పన్ను రేట్లను ప్రభుత్వం వార్షిక బడ్జెట్ రూపకల్పన సమయంలోనే స్థూల ఆర్థిక పరిస్థితులను బట్టి సమీక్షిస్తుందని, ప్రస్తుతానికి ఎల్‌టీసీజీని రద్దు చేసే ఎలాంటి ప్రతిపాదన లేదని పేర్కొన్నారు.
ఖజానాకు భారీగా పన్ను ఆదాయం
భారత మార్కెట్లలో రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యం ఊపందుకోవడంతో ఎల్‌టీసీజీ ద్వారా ప్రభుత్వానికి లభించే రాబడి భారీగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ (అసెస్మెంట్ ఇయర్ 2025-26) ఈక్విటీ ఎల్‌టీసీజీ పన్ను వసూళ్లు ఏకంగా 78.8 శాతం పెరిగి రూ.1,29,158 కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (ఏవై 2024-25) ఈ వసూళ్లు రూ.72,249 కోట్లుగా నమోదయ్యాయి.
ఎఫ్‌పీఐలతో సమానమైన పన్ను నిబంధనలు
విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపులపై వస్తున్న వార్తలను కూడా ప్రభుత్వం ఖండించింది. ఈక్విటీలపై విధిస్తున్న 12.5% ఎల్‌టీసీజీ పన్ను రేటు స్వదేశీ రిటైల్ ఇన్వెస్టర్లకు, విదేశీ ఇన్వెస్టర్లకు సమానంగానే వర్తిస్తుందని తెలిపింది. ఎఫ్‌పీఐలకు ఇటీవల ప్రకటించిన పన్ను మినహాయింపు కేవలం ప్రభుత్వ సెక్యూరిటీల పెట్టుబడుల వరకే పరిమితమని స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు పైబడిన ఈక్విటీ లాభాలపై 12.5% చొప్పున ఎల్‌టీసీజీ పన్ను అమలులో ఉంది. దేశీయ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన పన్ను రాబడిని సమకూరుస్తున్న ఈ విధానాన్ని మున్ముందు కూడా కొనసాగించడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.
ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్‌లోకి పసిడి.. నేటి ధరలు ఇలా..


