వ్యక్తిగత గోప్యతకు భంగం కలగొచ్చు
పార్లమెంట్ సభ్యులకు లోక్‌సభ సూచన
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు త్వరలో ప్రారంభమవుతున్న వేళ ఎంపీలకు లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం కీలక సూచనలు చేసింది. సభ్యులు పార్లమెంట్ ప్రాంగణంలో ఎక్కడైనా సరే స్మార్ట్‌వాచీలు, స్మార్ట్ కళ్లద్దాలను ఇతర సభ్యుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే రీతిలో ఉపయోగించకూడదని సూచించింది. ‘‘స్మార్ట్ కళ్లద్దాలు, పెన్ కెమెరాలు, స్మార్ట్ వాచ్‌ల వంటి అనేక అత్యాధునిక పరికరాలను ఇప్పుడు విస్తృతంగా వినియోగిస్తున్నారు.
వీటిని ఎంపీలు తోటి ఎంపీల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా, పార్లమెంటరీ విశేషాధికారాలను ఉల్లంఘించేలా ఉపయోగించకూడదు. పార్లమెంట్ లోపల, బయట పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ఎక్కడైనా సరే సభ్యుల గోప్యత, భద్రతకు, విశేషాధికారాలకు భంగం కలిగించే విధంగా ఇటువంటి అత్యాధునిక పరికరాలను ఉపయోగించకూడదు’’ అని లోక్‌సభ సెక్రటేరియట్ సూచించింది. ఈ మేరకు ఒక బులెటిన్‌ను విడుదలచేసింది. 20వ తేదీ నుంచి ఆగస్ట్ 13వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న విషయం తెల్సిందే.


