సుప్రీంకోర్టును ఆశ్రయించిన బండ్ల గణేష్‌ | Bandla Ganesh approaches the Supreme Court | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టును ఆశ్రయించిన బండ్ల గణేష్‌

Jul 16 2026 4:21 AM | Updated on Jul 16 2026 4:22 AM

Bandla Ganesh approaches the Supreme Court

హైకోర్టు తీర్పును సవాల్‌ చేసిన సినీ నిర్మాత  

సాక్షి, న్యూఢిల్లీ: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో జరుగుతున్న రుణ వివాదంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్ఫేసీ, ఐబీసీ చట్టాలకు సంబంధించిన కీలక అంశాలపై అత్యున్నత న్యాయస్థానంలో ఆయన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. హైదరాబాద్‌లోని శ్రీ పరమేశ్వర పౌల్ట్రీఫామ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన రుణాలకు సంబంధించి బండ్ల గణేష్, ఆయన కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత ఆస్తులను పూచీకత్తుగా పెట్టారు.

కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్‌ ప్రాసెస్‌ సమయంలో, బ్యాంక్‌ సర్ఫేసీ చట్టం కింద చర్యలు చేపట్టి తనఖా పెట్టిన ఆస్తుల్లో ఒకదానిని వేలం వేసింది. అయితే, ఈ వేలం ప్రక్రియను, సేల్‌ సర్టిఫికెట్‌ను హైదరాబాద్‌లోని రుణ వసూళ్ల ట్రిబ్యునల్‌ (డీఆర్‌టీ) తప్పుబట్టింది. కొనుగోలుదారుడికి వడ్డీతోసహా డబ్బును వాపసు చేయాలని, పిటిషనర్లకు ఆస్తిని తిరిగి అప్పగించాలని ఆదేశించింది. అయితే, డీఆర్‌టీ ఇచ్చిన ఈ తీర్పును హైకోర్టు కొట్టివేసింది. 

వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద బ్యాంక్‌ రూ.71.44 కోట్లతో సహా సుమారు రూ.129.02 కోట్లను రికవరీ చేసిందని, బకాయిలు పూర్తిగా తీరిపోయినట్లు సెటిల్‌మెంట్‌ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చిందని బండ్ల గణేష్‌ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆస్తిని వేలంలో కొనుగోలు చేసిన వ్యక్తి ముందుగానే సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు చేశారు. ఈ వ్యవహారం త్వరలో విచారణకు రానుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement