రాజ్‌కుమార్ అంతక్రియలు నిర్వహిస్తున్న పోలీసులు
వ్యవస్థలకు సవాల్ రాజ్‌కుమార్ ఉదంతం
నేరం జరిగిన తర్వాత స్పందించడం కాదు
నేరగాళ్లపై తక్షణ కఠిన చర్యలు తీసుకునే నిరంతర నిఘా వ్యవస్థలు సమాజంలో అత్యవసరంగా పెరగాలి
చనిపోయాక పాడె మోసే ‘ఆ నలుగురు’రాకపోతే జీవితానికి అర్థమే లేదు. ఇతిహాసాలు, పురాణాలు, పెద్దలు..ఏనాడో విడమరచి చెప్పిన జీవిత పరమార్థం ఇది.. దానిని విస్మరిస్తే జరిగేదేమిటో చెప్పడానికి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన నరరూప రాక్షసుడు రాజ్‌కుమార్ ఉదంతమే నిఖార్సయిన నిదర్శనం. రాక్షసుడు అనాథ శవంగా చితి మంటల్లో కాలిపోయినా.. పుట్టినిల్లు, మెట్టినిల్లు, పక్కింట్లో కూడా విషాద జ్వాలలు రగిల్చిపోయాడు. కట్టుకున్న భార్య, ఇద్దరు పిల్లలతో పాటు తనపై పోక్సో కేసు పెట్టిన మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మలను కిరాతకంగా రాజ్‌కుమార్ హతమార్చాడు.
బాధితులకు ఏ వ్యవస్థా న్యాయం చేయలేదు. పోయిన ప్రాణాలు తిరిగి ఇవ్వలేదు. ఆన్‌లైన్ బెట్టింగ్ గేములు, అప్పుల ఊబి, విచ్చలవిడి వ్యసనాలు, అక్రమ సంబంధాలతో కొందరు దారి తప్పి ఉన్మాదులుగా మారుతున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాలంటే కేవలం నేరం జరిగిన తర్వాత స్పందించడం కాదు. క్షేత్రస్థాయిలో వ్యసనాల అదుపు, కౌన్సెలింగ్ కేంద్రాల ఏర్పాటు, నేరగాళ్లపై తక్షణ కఠిన చర్యలు తీసుకునే నిరంతర నిఘా వ్యవస్థలు సమాజంలో అత్యవసరంగా పెరగాలి.
అనాథగా కాలిపోయిన ఉన్మాదం
రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాక, అతని మరణవార్త విన్నాక..సమాజంలో ఎక్కడా ’అయ్యో పాపం’అనే మాట వినిపించలేదు. పుట్టిన ఊరికి అతని శవాన్ని తేవద్దని గ్రామస్తులు నినదించగా, కన్న తల్లిదండ్రులు సైతం కడచూపు చూసేందుకు నిరాకరించారు. చివరకు మున్సిపల్ సిబ్బంది, పోలీసులు కలిసి అనాథ శవంలా దహన సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది. పాపం పండిన రోజున ఉన్మాదికి దక్కిన శాస్తి ఇది.
వ్యవస్థ వైఫల్యం.. పోక్సో చట్టంలో లొసుగులు
ఈ రక్తపాతానికి పోలీసుల నిర్లక్ష్యం, నిఘా లోపమే ప్రధాన కారణం. పోక్సో కేసు నమోదై, నిందితుడు బెయిల్‌పై బయట తిరుగుతున్నప్పుడు అతని కదలికలపై నిరంతర నిఘా ఉంచడంలో స్థానిక పోలీసులు, ఇంటెలిజె¯న్స్ సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారు. బాధితులకు తగిన రక్షణ కల్పించలేకపోయారు. ఈ తీవ్ర నిర్లక్ష్యానికి కారణమైన సీఐ, ఎస్‌ఐలపై సస్పెన్షన్ వేటు వేసినప్పటికీ, జరగాల్సిన ఘోరం జరిగిపోయాకే ఈ చర్యలు చేపట్టడం వ్యవస్థలోని అసమర్థతను ఎత్తిచూపుతోంది.
బాలికలపై లైంగిక దాడులను అరికట్టడానికి తెచ్చిన కఠినమైన పోక్సో చట్టంలో పోలీసులు ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే బలహీనమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం ఇక్కడ అతిపెద్ద లోపం. చట్టపరమైన లొసుగులు, అవినీతి వల్లే నేరగాళ్లకు చట్టం పట్ల భయం పోతోంది. డబ్బు వెదజల్లి సెక్షన్లు మార్చుకుని, బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చి బాధితులపై పగ తీర్చుకునే అవకాశం లభిస్తోంది.
కామాంధులకు, ఉన్మాదులకు ఇలాంటి చట్టపరమైన లొసుగులు వరంగా మారకూడదు. మరోవైపు నిందితుడు అప్పులు చేస్తూ, జులాయిగా తిరుగుతూ భార్యాపిల్లలను, కన్నవారిని వేధిస్తున్నాడని తెలిసినా చుట్టుపక్కల సమాజం, పంచాయతీలు, బంధుమిత్రులు ఎందుకు నిలదీయలేకపోయారు? సమాజంలో పెరుగుతున్న ఈ ’మనకెందుకులే’అన్న ఉదాసీన ధోరణే ఇలాంటి ఉన్మాదులకు పరోక్షంగా ఊతమిస్తోంది.
సైకోలపై నిఘా, సోషల్ ప్రొఫైలింగ్ ఎప్పుడు?
మానసిక అనారోగ్యాన్ని ఒక జబ్బుగా గుర్తించే భావన మన దేశంలో లేదు. ఒక వ్యక్తి సైకోలా ప్రవర్తిస్తున్నా అది సాధారణ గొడవగానే కొట్టిపారేస్తున్నారు. ప్రభుత్వపరంగా సైకోథెరపీ క్లినిక్‌లు, మానసిక విశ్లేషణ కేంద్రాలు కిందిస్థాయి వరకు అందుబాటులో లేవు. తెలంగాణలోని జిల్లా కేంద్రాల్లో సైతం మానసిక వైద్య సేవలు నామమాత్రంగానే ఉన్నాయి.
నేర ప్రవత్తి ఉన్నవారిని గుర్తించి, వారికి బలవంతంగానైనా మానసిక చికిత్స అందించే క్లినిక్‌లు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాల్సిన అవ సరం ఉంది. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో మన దగ్గర కూడా నేర చరిత్ర, హింసాత్మక ప్రవృత్తి ఉన్న వారిపై ’సైకో–సోషల్ ప్రొఫైలింగ్’, ఎల్రక్టానిక్ ట్యాగింగ్ వంటి నిరంతర నిఘా వ్యవస్థలు రావాలి. జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో మానసిక చికిత్సా కేంద్రాలు (సైకోథెరపీ క్లినిక్‌లు) ఏర్పాటు చేసి, నేర ప్రవృత్తి గలవారికి కౌన్సెలింగ్ అందించాలి.
– సాక్షి, సెంట్రల్ డెస్క్


