ప్రభుత్వ బడుల్లో ప్రపంచ భాషలు | CM Revanth at the inauguration of the girls school building in Kothakota | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడుల్లో ప్రపంచ భాషలు

Jul 16 2026 4:05 AM | Updated on Jul 16 2026 4:05 AM

CM Revanth at the inauguration of the girls school building in Kothakota

అమరరాజా కస్టమర్‌ క్వాలిఫికేషన్‌ ప్లాంట్‌ ప్రారంభిస్తున్న సీఎం రేవంత్‌. చిత్రంలో శ్రీధర్‌బాబు, జూపల్లి, వాకిటి, మల్లు రవి, డీకే అరుణ, గల్లా జయదేవ్‌ తదితరులు

విదేశీ విద్యా వ్యవస్థలపై ఉపాధ్యాయులతో అధ్యయనం 

దేశ, రాష్ట్ర భవిష్యత్‌ తరగతి గదిలోనే ఉంటుందని ప్రభుత్వం గుర్తించింది 

ఆగస్టు 15లోగా విద్యార్థులందరికీ 9 రకాల వస్తువులతో ఎడ్యుకేషన్‌ కిట్‌ 

కొత్తకోటలో బాలికల స్కూల్‌ భవనం ప్రారంబోత్సవంలో సీఎం రేవంత్‌ 

విద్యార్థినులతో సీఎం ముఖాముఖి 

దివిటిపల్లిలో అమరరాజా కస్టమర్‌ క్వాలిఫికేషన్‌ ప్లాంట్‌ ప్రారంభం 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో జర్మనీ, జపాన్, ఇతర అభివృద్ధి చెందిన దేశాల భాషలను నేర్పించేలా మార్పులు తీసుకురావాల్సి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. దేశ, రాష్ట్ర భవిష్యత్‌ తరగతి గదిలోనే ఉంటుందని ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మెరుగైన విద్యావ్యవస్థ కోసం ఆధునిక విద్యావ్యవస్థలు కలిగిన దేశాలకు ప్రభుత్వ టీచర్లను పంపించి అధ్యయనం చేయిస్తామని తెలిపారు.

ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవంలోగా సర్కారు బడిలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులందరికీ.. విద్యాభ్యాసానికి ఉపయోగపడే 9 రకాల వస్తువులతో ఎడ్యుకేషన్‌ కిట్‌ను అందజేస్తామని వెల్లడించారు. బుధవారం మహబూబ్‌నగర్‌ జిల్లా దివిటిపల్లిలోని అమరరాజా గిగా కారిడార్‌లో కస్టమర్‌ క్వాలిఫికేషన్‌ ప్లాంట్‌ (సీక్యూపీ)ను సీఎం ప్రారంభించారు. అనంతరం వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్మించిన బాలికల పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. 

టీచర్లు ప్రశాంతంగా ఉంటేనే సరైన బోధన 
‘గత పాలకులు పదేళ్లు విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేస్తే, దేశ భవిష్యత్‌ నిర్మాణానికి విద్యాశాఖ కీలకమని గుర్తించి ఆ శాఖను నా వద్దే పెట్టుకుని సంస్కరణలకు శ్రీకారం చుట్టా. మొదట ఉపాధ్యాయుల కుటుంబాలను విడగొట్టిన 317 జీఓ వలన కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు 35 వేలమంది ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టి ఎక్కడా లోపం లేకుండా పూర్తి చేశాం. టీచర్లు కుటుంబంతో ప్రశాంతం ఉన్నప్పుడే విద్యార్థులకు సరైన బోధన అందించడం సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఈ దిశగా ముందడుగు వేశాం.  

దేశంలో నంబర్‌ 1 స్థానానికి కృషి చేయాలి 
విద్యార్థుల బలిదానాలతో వచ్చిన తెలంగాణలో విద్య నిర్లక్ష్యానికి గురికావటం శోచనీయం. 2023కు ముందు విద్యలో మన రాష్ట్రం దేశంలో చివరి నుంచి ఒకటి, రెండోస్థానంలో ఉంటే.. ప్రజాప్రభుత్వం అధి కారంలోకి వచ్చాక 15వ స్థానానికి ఎగబాకింది. ఈ పురోగతి ఉపాధ్యాయులదే. ఇంకొంత కాలం విశ్రాంతికి ఆస్కారం లేకుండా నంబర్‌ వన్, టు స్థానాలకు వచ్చే వరకు ప్రయత్నించాలి. అందుకు కావాల్సిన అన్ని రకాల ప్రోత్సాహం ప్రభుత్వం అందిస్తుంది. 

చదువులో రాణించని విద్యార్థుల కోసం పాలసీ 
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. కొంత సమయం తీసుకుని పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం. చ దువులో రాణించలేకపోయిన విద్యార్థుల కోసం నూతన క్రీడా విధానాన్ని తీసుకువస్తున్నాం. క్రీడల్లో రాణించి దేశానికి పేరు తీసుకువచ్చిన ఎందరో నామమాత్రపు చదువు చదివిన వారిని గ్రూప్‌–1 అధికారులుగా చేసి సత్కరించాం..’అని సీఎం తెలిపారు.  

వెల్త్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ తెలంగాణ 
దివిటిపల్లిలో మాట్లాడుతూ.. ‘తెలంగాణ జీడీపీని పది శాతానికి చేర్చాలి. వెల్త్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ రాష్ట్రంగా చేయాలి. మాకు పాలసీలకు సంబంధించి ఎలాంటి పక్షపాతం లేదు. గత ప్రభుత్వాలు ఎన్నో పాలసీలు చేశాయి. ప్రజాప్రయోజనం చేకూర్చే పరిశ్రమలను ప్రోత్సహించే విధానాలను మేమూ కొనసాగిస్తున్నాం. కొన్నింటిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. మెడికల్, హెల్త్, టూరిజం, ఇండ్రస్టియల్, స్పోర్ట్స్‌ పాలసీలు తెచ్చాం. ఈ పాలసీలు తెలంగాణను రైజ్‌ చేసి, తెలంగాణ రైజింగ్‌–2047కు నాందిగా నిలువనున్నాయి. 

జపాన్, చైనా, కొరియా దేశాలతో పోటీ పడాలంటే పరిశ్రమలు పెట్టాలి. వాటిని స్థాపించాలంటే మౌలిక వసతులు కల్పించాలి. అందుకు స్పష్టమైన, పారదర్శకమైన పరిపాలన విధానం ఉండాలి. ప్రభుత్వం ఆ మేరకు విధానం రూపొందించుకుని ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే అమరరాజాను ప్రోత్సహిస్తున్నాం..’అని రేవంత్‌ చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకి టి శ్రీహరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ ఎంపీలు డీకే అరుణ, మల్లు రవి, ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి సంజయ్‌జాజు, సీఎం ముఖ్యకార్యదర్శి ఎన్‌.శ్రీధర్, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, ఈర్లపల్లి శంకర్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

ఈ రోజు చిరస్మరణీయం 
‘ఒకప్పుడు చెట్లకింద, ఇరుకైన గదులలో చదువుకునే పరిస్థితి ఉండేది. ఒక్కోగదిలో రెండు క్లాస్‌లు నడిపించేవారు. మా కష్టాలను, ఇబ్బందులను అర్థం చేసుకుని మా భవిష్యత్‌ కలలను గుర్తించిన మా ఎమ్మెల్యే జీఎంఆర్, సీఎం రేవంత్‌రెడ్డి అన్ని సౌకర్యాలతో మాకు కొత్త స్కూల్‌ నిర్మించి ఇచ్చారు..’అని కొత్తకోట జెడ్పీ బాలిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇందు చెప్పింది. కొత్తకోట బాలికల ఉన్నత పాఠశాల చరిత్రలో ఈ రోజు చిరస్మరణీమని పేర్కొంది. ‘మా విద్యార్థుల ఆనందానికి అవధులు లేవు. మీ మేలు మేము మర్చిపోలేం..’అనడంతో.. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చిరునవ్వులు చిందిస్తూ చప్పట్లు కొట్టారు. 

మీరే నా స్ఫూర్తి.. 
‘కొండరెడ్డిపల్లి, వనపర్తి ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదువుకుని రాష్ట్రాన్ని పాలించే సీఎం స్థాయికి ఎదిగిన మీరే నా స్ఫూర్తి..’అంటూ కొత్తకోట సాంఘిక సంక్షేమ శాఖ గురుకులంలో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థిని ఏంజెల్‌ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. 

ప్రభుత్వ గురుకులంలో చదువుకునే తాను జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు సీఎంను స్ఫూర్తిగా తీసుకుంటున్నట్లు ఏంజెల్‌ తెలిపింది. గురుకులాల్లో చదువుకునే విద్యార్థినులకు కాస్మోటిక్‌ చార్జీలు, మెస్‌ చార్జీలు పెంచటం తదితరాలతో విద్యార్థులకు ఎంతో మేలు చేశారంటూ ముఖ్యమంత్రిని ప్రశంసించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement