మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు జూలై 15 నుంచే హెల్త్ కార్డులు జారీ చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మాట తప్పిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్‌రావు విమర్శించారు. పథకం అమలుకు మార్గదర్శకాలను విడుదల చేయకపోవడం, నెట్‌వర్క్ ఆస్పత్రులతో పూర్తిస్థాయి ఒప్పందాలు లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. పథకం అమలు చేయకుండానే ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్ల నుంచి రెండు నెలలుగా 1.5 శాతం ప్రీమియం కోత విధించడం మోసమేనని మండిపడ్డారు.
డేట్లు, డెడ్‌లైన్లు మారుతున్నాయే తప్ప హెల్త్ కార్డులు మాత్రం అందడం లేదని ఒక ప్రకటనలో హరీశ్‌రావు విమర్శించారు. ఉద్యోగులకు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని ఆరోపించారు. 30 నెలలు గడిచినా పీఆర్సీ, ఆరు డీఏలు, సీపీఎస్ రద్దు, హెల్త్ స్కీం అమలుపై ప్రభుత్వం ముందడుగు వేయలేదన్నారు. హెల్త్ కార్డులు జారీ చేసి, పథకం అమలు కాకముందే వసూలు చేసిన ప్రీమి యం మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని, లేదంటే బీఆర్‌ఎస్ ఉద్యమం చేపడుతుందని హరీశ్ హెచ్చరించారు.


