అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెంపు | Govt explores 50percent LS seat hike to break delimitation deadlock | Sakshi
Sakshi News home page

అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెంపు

Jun 30 2026 5:28 AM | Updated on Jun 30 2026 5:28 AM

Govt explores 50percent LS seat hike to break delimitation deadlock

కేంద్రం యోచన

జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్ల పెంపుపై పెరుగుతున్న వ్యతిరేకత 

న్యూఢిల్లీ: జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్ల పెంపు విషయంలో నిర్ణయం తీసుకుంటే తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆగ్రహావేశాలు ఎక్కువవుతున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో జనాభా సిద్ధాంతాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టి అన్ని రాష్ట్రాలకు సమన్యాయం దక్కేలా ఏక రీతిగా 50 శాతం సీట్లను పెంచాలని మోదీ సర్కార్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

మహిళా రిజర్వేషన్‌ చట్టం అమలుకు సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు కోసం తాజాగా ముసాయిదా బిల్లును తయారుచేసే పనిలో పడ్డ ఎన్‌డీఏ సర్కార్‌ అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల పెంపు మీద సైతం కసరత్తు చేస్తోందని విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. అయితే గతంలో తీసుకొచ్చిన ముసాయిదా బిల్లు ఏప్రిల్‌ 17వ తేదీన మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో వీగిపోవడం తెల్సిందే. 

మునుపటి బిల్లును ఆధారంగా చేసుకుని కొత్తగా మోదీ ప్రభుత్వం తయారుచేసిన ముసాయిదా బిల్లులో 1971 నాటి జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల మధ్య లోక్‌సభ సీట్ల నిష్పత్తిని యథాతథంగా కొనసాగించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మరోవైపు తాజా జనాభా లెక్కలు పూర్తయ్యాక 2011 జనాభాలెక్కలను పక్కనపెట్టి లోక్‌సభ, అసెంబ్లీలో సీట్ల కేటాయింపులు జరగనున్నాయని గతంలో ప్రకటించడం తెల్సిందే. 

ఏప్రిల్‌లో పార్లమెంట్‌లో పరాభవం ఎదురైన నేపథ్యంలో ఈసారి మెజారిటీ సంఖ్యాబలం ఉన్న తర్వాతనే బిల్లుకు తుది రూపునిచ్చి సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్‌డీఏకు 300 మంది ఎంపీల బలముంది. మూడు ఖాళీలున్నాయి. 

ప్రస్తుతమున్న మొత్తం సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే కొత్త బిల్లు నెగ్గాలంటే ప్రభుత్వానికి మూడింట రెండొంతులు అంటే కనీసం 360 మంది ఎంపీల మద్దతు ఉండాల్సిందే. ప్రస్తుత మహిళా రిజర్వేషన్‌ చట్టం ప్రకారం మహిళలకు రిజర్వేషన్‌ కల్పించడం అనేది 2034 ఏడాదికి ముందు అమలుచేయడం కుదరదు. 2027 జనాభా లెక్కలు పూర్తయ్యాకే ఈ రిజర్వేషన్‌ అమలుచేయాలని గతంలో మెలిక పెట్టారు. 2029 లోక్‌సభ ఎన్నికల నుంచి చట్టంలోని నిబంధనలు అమల్లోకి వస్తాయి.   
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement