ఆటోపై కుక్క మూత్రం పోసిందని.. | Khammam Pet Dog Incident | Sakshi
Sakshi News home page

ఆటోపై కుక్క మూత్రం పోసిందని..

Aug 15 2026 7:41 AM | Updated on Aug 15 2026 8:20 AM

Khammam Pet Dog Incident

ఖమ్మంక్రైం: ఆటోపై కుక్క మూత్ర విసర్జన చేసిందనే కారణంతో మొదలైన వివాదం తీవ్రరూపం దాల్చగా ఓ యువకుడి మృతికి దారి తీసింది. అయితే, ఘర్షణ పడిన ఇద్దరి మధ్య పాత ఘర్షణలు ఉండడం గొడవ పెరగడానికి కారణమని తెలుస్తోంది. ఖమ్మం త్రీ టౌన్‌ ప్రాంతంలో ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. 

ఉపాధి కోసం వచ్చిన కుటుంబాలు
ఖమ్మం రూరల్‌ మండలం పోలేపల్లికి చెందిన ఉండేటి ఏసు – నాగమణి దంపతులకు కుమారుడు శ్రీనాధ్‌ అలియాస్‌ పండు(24), కుమార్తె ఉన్నారు. శ్రీనాధ్‌ చిన్నప్పటి నుంచి త్రీటౌన్‌ ప్రాంతంలోని రంగనాయకుల గుట్ట ప్రాంతంలో అమ్మమ్మ వెంకటమ్మ, మేనమామ రాజు వద్ద ఉంటూ ఫ్లెక్సీ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. 

ఆయన తల్లిదండ్రులు టేకులపల్లిలోని డబుల్‌ బెడ్‌రూమ్‌లో నివసిస్తున్నారు. ఇక రంగనాయకుల గుట్ట వద్దే మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలానికి చెందిన వేముల యల్లమ్మ తన కుమారుడైన మధుతో కలిసి కూలీ పనులు చేస్తూ అద్దె ఇంట్లో జీవిస్తోంది. కాగా, శ్రీనాధ్‌ – మధుకు మధ్య పాత గొడవలు ఉన్నాయి. ఈక్రమాన గురువారం రాత్రి 11గంటలు దాటాక మ«ధు తన పెంపుడు కుక్కను బయటకు తీసుకెళ్లగా శ్రీనాధ్, ఆయన స్నేహితుడు వీరేశ్‌తో కలిసి ఆటోలో కూర్చున్నారు. ఈమేరకు కుక్క వారు కూర్చున్న ఆటోపై మూత్రవిసర్జన చేయడమే కాక చీకట్లో ఉన్న శ్రీనాధ్, ఆయన స్నేహితుడిని చూసి మొరిగింది. 

దీంతో కావాలనే మధు తమపై కుక్కను ఉసిగొల్పాడని భావించి వాగ్వావాదానికి దిగారు. ఈక్రమాన ‘కుక్కను కట్టేసి వచ్చి సంగతి చూస్తా’ అంటూ మధు వెళ్లిపోయాడు. అక్కడి నుంచి శ్రీనాధ్, వీరేశ్‌ ఆయన ఇంటికి వెళ్లి గొడవ పడుతూ కర్రలతో కొట్టుకున్నారు. దీంతో క్షణికావేశంతో మధు ఇంట్లోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తి తీసుకొచ్చి శ్రీనాధ్‌ను పలుమార్లు పొడవగా తీవ్ర రక్తస్రావంతో ఆయన సమీపంలోని డ్రెయినేజీలో పడి అపస్మారక స్థితికి చేరాడు. ఈలోగా శ్రీనాధ్‌ అమ్మమ్మ, మేనమామ చేరుకుని పెద్దాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.

పోలీసుల అదుపులో నిందితుడు?
ఘటన సమాచారం అందుకున్న నగర ఏసీపీ రమణమూర్తి, త్రీటౌన్‌ సీఐ మోహన్‌బాబు, సిబ్బంది వచ్చేసరికి మధు పారిపోయాడు. కాగా, శ్రీనాధ్‌ మృతదేహంపై ఏడు కత్తిపోట్లు ఉండగా, పేగులు సైతం బయటకు రావడంతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. ఆయన మృతదేహాన్ని మార్చురీకి తరలించగా స్నేహితులు భారీగా తరలివచ్చారు. అలాగే, కాంగ్రెస్‌ నాయకులు రుద్రగాని ఉపేందర్, నల్లపు శ్రీను ఆయన కుటుంబీకులను పరామర్శించారు. మూడేళ్ల పంపింగ్‌ వెల్‌రోడ్డులో జరిగిన ఘర్షణలో సాయి అనే వ్యక్తి కత్తిపోట్లతో మృతి చెందా డు. మళ్లీ ఇప్పుడు తరహా గొడవ జరగడం గమనార్హం. కాగా, పరారీలో ఉన్న మధును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మరోపక్క పోసుమార్టం అనంతరం శ్రీనాధ్‌ మృతదేహాన్ని రంగనాయకుల గుట్ట వద్ద ఇంటికి తీసుకొచ్చాక స్వగ్రామమైన పోలేపల్లికి తీసుకెళ్లారు. ఈక్రమాన పోలీసులు బందోబస్తు చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement