సాక్షి,హైదరాబాద్: గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ మొదటి వారంలో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. ఆ మేరకు టెండర్ ప్రక్రియను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన ‘గోదావరి పుష్కరాలు - 2027’ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ (సీతక్క), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు శాఖలవారీగా సన్నద్ధత, ఏర్పాట్ల పురోగతిని సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు కేటాయించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే టైర్-1 ప్రాంతాల్లో పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని, అలాగే భద్రత మరియు సమన్వయం కోసం ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి కావాలని, అదే సమయంలో నాణ్యతలో ఎలాంటి రాజీ పడొద్దని స్పష్టం చేశారు. పనుల పురోగతిని పరిశీలించేందుకు అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని, పనుల పురోగతిని రోజువారీగా పర్యవేక్షించేందుకు వీలుగా దేవాదాయ శాఖ అధికారులు ఒక ప్రత్యేక డ్యాష్‌బోర్డ్‌ను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
పుష్కరాలకు వచ్చే భక్తులకు రవాణా పరంగా ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రతి రోడ్డును అనుసంధానించాలని, ఎక్కడైనా రోడ్ల కనెక్టివిటీ లోపిస్తే వెంటనే గుర్తించి లోకల్ ఫండ్స్ నుంచి పనులు చేపట్టాలని చెప్పారు. అన్ని శాఖలు సమష్టిగా పనిచేస్తేనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పుష్కరాలను విజయవంతం చేయవచ్చని, శాఖల మధ్య సమన్వయ లోపం రాకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. ఏర్పాట్లలో స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, పండితులతో పాటు సేవలందించేందుకు ముందుకొచ్చే స్వచ్ఛంద, ప్రైవేట్ సంస్థలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. కేబినెట్ సబ్ కమిటీ సభ్యుల సలహాలను విధిగా పరిగణనలోకి తీసుకోవాలని, పుష్కర ఏర్పాట్లలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.


