పేదలకు ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇవ్వాలి | Talasani Slams Congress: Demand for Free Housing for the Poor | Sakshi
Sakshi News home page

పేదలకు ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇవ్వాలి

Aug 15 2026 1:00 AM | Updated on Aug 15 2026 1:00 AM

Talasani Slams Congress: Demand for Free Housing for the Poor

కాంగ్రెస్ ప్రభుత్వానికి పేద ప్రజలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని మాజీమంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 560 గజాల స్థలంలో అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను నిర్మించి ఇచ్చారని గుర్తుచేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 109 ప్రాంతాలలో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టి, వాటిలో 69 వేల ఇండ్లను అర్హులైన పేదలకు పారదర్శకంగా అందజేసినట్లు వివరించారు. కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాలలో తాము ఇండ్లు నిర్మించామని తెలిపారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు ఎక్కడ నిర్మించిందని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారని, తమ వెంట వస్తే తాము నిర్మించిన ఇండ్లను ప్రత్యక్షంగా చూపిస్తామని సవాల్ చేశారు. కొల్లూరు ప్రాంతంలో ఒకేచోట 16 వేల ఇండ్లను నిర్మించామని, ఇది ఆసియా ఖండంలోనే అత్యధిక గృహ సముదాయం ఉన్న ప్రాంతం అని తెలిపారు. విద్యుత్, డ్రైనేజీ, రోడ్లు, లిఫ్ట్, తాగునీరు వంటి అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఉచితంగా ఇండ్లు నిర్మించినా ఎక్కడా తమ పేర్లు పెట్టుకోలేదని, కానీ లబ్ధిదారుల వద్ద రూ. 6 లక్షలు వసూలు చేస్తూ 'ఇందిరమ్మ ఇండ్లు' అని పేరు పెట్టుకోవడం ఏమిటని విమర్శించారు. 

ఎన్ని గజాల స్థలంలో ఇండ్లు నిర్మిస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇండ్ల కోసం దరఖాస్తుతో పాటు రూ. 10 వేలు చెల్లించాలని చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలు చెల్లించిన డబ్బులు ఇప్పటికీ రాలేదన్నారు. 22-ఏ జాబితాలోకి భూములు చేర్చి, పేదల భూములపై ఆంక్షలు పెట్టి, ఇప్పుడు మీ భూమి మీకే ఇప్పిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తలసాని మండిపడ్డారు. దీనిని అడ్డం పెట్టుకుని 30 నుండి 40 శాతం పర్సంటేజీల దందా ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసని, త్వరలోనే వారి వివరాలు బయటకు వస్తాయని హెచ్చరించారు. 

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని తాము దేవుళ్లను ప్రార్థిస్తే, క్షుద్ర పూజలు చేశారంటూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం బాధాకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటానికి ఒక వేదిక కావాలనే ఉద్దేశంతోనే తెలంగాణ భవన్‌ను నిర్మించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ నిర్మాణం జరిగి 20 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ తెలంగాణ భవన్ ఒక 'జనతా గ్యారేజీ'లా మారిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement