వీటి కొనుగోలుపై త్వరలో కన్సల్టెన్సీ
పాలకమండలి సమావేశంలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కొత్త కోచ్‌లపై హైదరాబాద్ మెట్రో రైల్ దృష్టి సారించింది. కోచ్‌ల నిర్మాణ సంస్థ ఎంపికలో సంప్రదింపులకు త్వరలో కన్సల్టెన్సీని నియమించనుంది. ఈ మేరకు ఆన్‌లైన్ బిడ్డింగ్ నోటిఫికేషన్ వెలువరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం జరిగిన హెచ్‌ఎంఆర్‌ఎల్ పాలకమండలి సమావేశంలోనూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ ఇదే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. త్వరితగతిన కొత్త కోచ్‌లను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
ప్రయాణికుల డిమాండ్ మేరకు కొత్తగా 60 బోగీలను కొనుగోలు చేయాలని గత పాలకమండలి సమావేశంలో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. గురువారం సమావేశంలోనూ ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు అధికారులు చెప్పారు. ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్‌రంజన్, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు మేనేజింగ్ డైరెక్టర్ అజిత్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ప్రస్తుతం మెట్రో రైళ్లు 3 బోగీలతో రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికులకు రద్దీ మేరకు ప్రతి మెట్రోకు అదనంగా మరో 3 బోగీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ప్రతిపాదించారు. మరోవైపు మెట్రో రెండో దశలో ప్రతిపాదించిన 5 మార్గాలపైనా జనరల్ కన్సల్టెన్సీలను నియమించేందుకు హెచ్‌ఎంఆర్‌ఎల్ చర్యలు చేపట్టింది.


