ఉజ్వల్ చౌదరి, దివేష్ చౌదరి (ఫైల్)
హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు చిన్నారుల దుర్మరణం
మరో అయిదుగురికి గాయాలు
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన
వివేకానందనగర్‌లో విషాద ఛాయలు
హైదరాబాద్, మోతీనగర్: మూడు కుటుంబాలు కలిసి దైవ దర్శనం చేసుకున్నాయి. తిరుగు పయనంలో నగరానికి బయలుదేరాయి. ఈ క్రమంలో వీరు వస్తున్న వాహనం అదుపుతప్పడంతో ఇద్దరు బాలురు మృతి చెందిన విషాదకర ఘటన షోలాపూర్‌లో చోటుచేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి.. కూకట్‌పల్లి పరిధి గాయత్రీనగర్ డివిజన్ శ్రీ వివేకానంద నగర్‌లోని మూడు కుటుంబాలకు చెందిన సుమారు 15 మంది బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని తుల్జా భవానీ మాత దర్శనానికి వెళ్లి ఇదేరోజు తిరిగి నగరానికి వస్తుండగా.. షోలాపూర్ ఉమగ్రా వద్ద ఉదయం 10.30 గంటలకు వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఉజ్వల్ చౌదరి (12), దివేష్ చౌదరి (11) మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రంగా, ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఇంటర్ విద్యార్థిని డింపుల్ (17) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
మూలమలుపు కారణంగా వాహనాలు సరిగా కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన చిన్నారులు ఉజ్వల్, దివేష్ వరుసకు అన్నదమ్ములు. 6వ తరగతి చదువుతున్నారు. ఉజ్వల్ చౌదరి తండ్రి గణేష్, తల్లి రేఖ. దివేష్ చౌదరి తండ్రి చోగారాం, తల్లి చంపాదేవి. వీరు ఇరువురు కూడా వరుసకు అన్నదమ్ములే. వీరంతా బంగారం వ్యాపారం చేస్తుంటారు. మృతులకు గురువారం వి.రామారావు నగర్‌లోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారు. బాధిత కుటుంబ సభ్యులను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు పరామర్శించారు.


