ప్రత్యేక భద్రతా ఫీచర్లు .. క్యూఆర్ కోడ్‌తో డిజిటల్ ధ్రువీకరణ
రేపు సంగారెడ్డిలో సీఎం చేతుల మీదుగా అందజేత
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థలో లబ్దిదారుల గుర్తింపును మరింత పటిష్టం చేయడంతోపాటు నకిలీ రేషన్ కార్డులకు అడ్డుకట్ట వేసేలా తెలంగాణ ప్రభుత్వం కొత్త ఫుడ్ సెక్యూరిటీ కార్డు (స్మార్ట్ రేషన్‌కార్డు)లో పలు భద్రతా ఫీచర్లను పొందుపరిచింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కొత్త స్మార్ట్ రేషన్‌కార్డులను అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఈ కార్డులో కనిపించే భద్రతా అంశాలతోపాటు సాధారణంగా గుర్తించలేని రహస్య భద్రతా గుర్తులు, స్పర్శ ద్వారా గుర్తించే సాంకేతికత, డిజిటల్ ధ్రువీకరణ వంటి పద్ధతులను కార్డులో వినియోగించారు. కార్డుపై తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో కూడిన హోలోగ్రామ్‌ను ముద్రించారు. అలాగే జారీ చేసే అధికారి అయిన పౌరసరఫరాల కమిషనర్ అధికారిక సంతకాన్ని కూడా కార్డులో పొందుపరిచారు. దీంతో కార్డు ప్రామాణికతను నిర్ధారించడం, నకిలీ కార్డుల తయారీని అడ్డుకోవడం, ప్రజా పంపిణీ వ్యవస్థలో లబ్దిదారుల గుర్తింపును బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
చేతితో తడిమితే తెలిసే అక్షరాలు
‘గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’అనే పదాలను ఉబ్బెత్తుగా ముద్రించారు. చేతితో తడిమినప్పుడు ఈ అక్షరాలు స్పష్టంగా తెలుస్తాయి. అలాగే కార్డులో మైక్రో ప్రింటెడ్ టెక్సŠట్‌ను కూడా ఉపయోగించారు. అతి చిన్న పరిమాణంలో ఉండే ఈ అక్షరాలు సాధారణంగా కంటికి స్పష్టంగా కనిపించవు. పెద్దదిగా పరిశీలించినప్పుడు మాత్రమే చదవగలిగేలా ఉంటాయి. సాధారణ ప్రింటర్లతో నకిలీ చేయడం కష్టంగా ఉండటంతో ఇది యాంటీ–కాపీ భద్రతా అంశంగా పనిచేస్తుంది.‘గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’, ‘ఒరిజినల్’వంటి అక్షరాలతో ద్వంద్వ రహస్య చిత్రాలను పొందుపరిచారు.
నిర్దిష్ట కోణంలో చూసినప్పుడు లేదా పెద్దదిగా పరిశీలించినప్పుడు మాత్రమే ఇవి కనిపిస్తాయి. కార్డు అసలైనదో కాదో నిర్ధారించేందుకు నిపుణులకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో వాటర్‌మార్క్‌ను కార్డులో పొందుపరిచారు. కార్డును వెలుతురుకు ఎదురుగా ఉంచినప్పుడు ఈ గుర్తు కనిపిస్తుంది. ప్రభుత్వ పత్రాల్లో సాధారణంగా ఉపయోగించే బలమైన ధ్రువీకరణ భద్రతా విధానాల్లో ఇది ఒకటి. అలాగే సాధారణ వెలుతురులో కనిపించని తెలంగాణ ప్రభుత్వ చిహ్నాన్ని అతినీలలోహిత (యూవీ) కాంతిలో కనిపించేలా ప్రత్యేక సిరాతో ముద్రించారు.
యూవీ కాంతి కింద ఈ గుర్తు వెలుగుతుంది. దీంతో రహస్యంగా కార్డును తనిఖీ చేయడంతోపాటు యంత్రాల ద్వారా కూడా వేగంగా ధ్రువీకరించవచ్చు. ఫుడ్ సెక్యూరిటీ కార్డులో లబ్దిదారుల వివరాలను భద్రంగా ధ్రువీకరించేలా ఎన్‌క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. అదీకృత సాఫ్ట్‌వేర్ లేదా స్కానింగ్ వ్యవస్థల ద్వారా మాత్రమే ఇందులోని సమాచారాన్ని ధ్రువీకరించేలా రూపొందించారు. కార్డుకు సంబంధించిన సీరియల్ నంబర్ తదితర డిజిటల్ సమాచారాన్ని ఇందులో భద్రపరచవచ్చు. అ«దీకృత వ్యవస్థ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినప్పుడు మాత్రమే వివరాలను ధ్రువీకరించే అవకాశం ఉంటుంది.


