దహనం అనంతరం లభించిన ఎముకలను పరిశీలిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులు
ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల జీవితంలోకి ప్రవేశం
ఆపై అనైతిక బంధం వైపు అడుగులు
దూరం పెడుతోందన్న కక్షతోనే హత్య
నాలుగు రోజులు ముందుగానే చితిని సిద్ధం చేసిన నిందితుడు
వెల్దండ: ఆరేళ్లుగా అన్యోన్యంగా సాగుతున్న దాంపత్య జీవితంలోకి ఓ స్నేహితుడి ప్రవేశం చిచ్చురేపింది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసి.. చివరకు ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. కొట్ర గ్రామానికి చెందిన నారమల్ల చెన్నయ్య, కావటి అనూష(25) ఆరేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అనూష కల్వకుర్తిలోని ఓ దుకాణంలో పనిచేస్తోంది.
ఈ క్రమంలో చెన్నయ్యకు సన్నిహితుడైన శ్యాంపూరి రాములు ఆ కుటుంబానికి దగ్గరయ్యాడు. ఆ తర్వాత అనూషతో రాములుకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. బుధవారం సాయంత్రం పని ముగించుకున్న అనూష గ్రామానికి వెళ్లేందుకు కల్వకుర్తిలోని హైదరాబాద్ చౌరస్తాకు వచ్చింది. భర్తకు ఫోన్ చేసి ఆటో కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. రాత్రి 7 గంటల సమయంలో గ్రామానికి వెళ్తున్నానంటూ వచ్చిన రాములు తన బైక్‌పై ఆమెను తీసుకెళ్లాడు. భార్య ఎంతకూ ఇంటికి రాకపోవడంతో చెన్నయ్య ఆమెకు ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ రావడంతో కల్వకుర్తి వెళ్లి అనూష పనిచేసే దుకాణంలో ఆరా తీశాడు. అప్పటికే ఆమె వెళ్లిపోయిందని చెప్పడంతో పోలీసులను ఆశ్రయించాడు.
హతమార్చేందుకు ముందుగానే పథకం
అనూష కొంతకాలంగా తనను దూరం పెడుతోందని రాములు భావించాడు. తనతో మాట్లాడాలని, కలవాలని కోరినా ఆమె నిరాకరించడంతో అతడిలో కక్ష పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను హతమార్చేందుకు పథకం వేశాడు. ఇందుకోసం ఆదివారం రోజే కట్టెలను సమకూర్చుకుని.. పట్టణ శివారులోని వడ్డోనీరాళ్ల వద్ద చితిని సైతం సిద్ధం చేసుకున్నాడు. హత్య చేసిన తర్వాత అక్కడే తగలబెట్టాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు.
బుధవారం రాత్రి ఆటో కోసం ఎదురుచూస్తున్న అనూషను రాములు బైక్‌పై తీసుకెళ్లి కొట్రగేట్–హైదరాబాద్ రోడ్డులోని ఓ మామిడితోట వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై దాడి చేసి, గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అదే గ్రామానికి చెందిన అల్లుడు వరుసయ్యే నాయిని శ్రీనుకు సమాచారం ఇచ్చి సంఘటనా స్థలానికి పిలిపించుకున్నాడు. అనంతరం మృతదేహాన్ని వడ్డోనిరాళ్ల వద్ద ఏర్పాటు చేసుకున్న చితివద్దకు తీసుకెళ్లి డీజిల్ పోసి తగలబెట్టి తిరిగి వచ్చేశారు.
హత్య అనంతరం రాములు గ్రామంలో కొంతసేపు తిరిగాడు. చెన్నయ్య భార్య కోసం వెతుకుతున్న విషయం తెలిసి.. భయాందోళనకు గురైన రాములు బుధవారం అర్ధరాత్రి వెల్దండ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. తానే అనూషను హత్య చేసినట్లు చెప్పడంతో నిందితుడు ఇచ్చిన సమాచారంతో వెల్దండ సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్‌ఐ యుగంధర్‌రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు సమక్షంలో ఘటనాస్థలంలోనే మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం చేపట్టారు. అక్కడ లభించిన ఎముకలు, ఇతర వస్తువులను మృతురాలి భర్త చెన్నయ్యకు అప్పగించారు.


