కోలీవుడ్ నటుడు ఆర్ మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణమైన పాత్రలను ఎంచుకుని, అద్భుతమైన అభినయంతో మెప్పించే నటుడు మాధవన్. ప్రస్తుతం ఆయన పారిశ్రామికవేత్త, ఆవిష్కర్త గోపాలస్వామి దొరైస్వామి నాయుడు పాత్రలో తమిళ బయోపిక్ డ్రామా 'GDN'లో కనిపించనున్నారు. తరుచుగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పలువురి స్ఫూర్తిదాయకమైన కథలతో ప్రేరణ కలిగించే ఆయన ఈసారి మరింత ఆసక్తికర ప్రేరణాత్మక కథను పంచుకున్నారు. గ్వాలియర్‌లోని టాక్టిక్స్ అండ్ ఎయిర్ కంబాట్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (TACDE)లో ప్రతిష్టాత్మకమైన ఫైటర్ కంబాట్ లీడర్ (FCL) కోర్సును పూర్తి చేసిన తొలి మహిళా పైలట్‌గా స్క్వాడ్రన్ లీడర్‌గా భావనా కాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆమె సాధించిన ఘనతను ప్రశంసిస్తూ..వైమానిక దళంలోకి వచ్చిన విధం గురించి పంచుకున్నారు మాధవన్.
ఫైటర్ పైలట్ నుంచి ఎఫ్‌సీఎల్ మార్గదర్శకురాలిగా..
అధికారులకు అధునాతన పోరాట వ్యూహాలలో శిక్షణ ఇచ్చే ఈ కఠినమైన 20-వారాల కార్యక్రమానికి కేవలం కొద్దిమంది IAF పైలట్లను మాత్రమే ఎంపిక చేస్తారు. అలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి భావనా కాంత్ ఎంపికకావడంతో అసాధారణమైన ఘనతను సాధించిన తొలిమహిళగా నిలిచింది. అంతేగాదు ఆమె 2021లో, భారతదేశ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా చరిత్ర సృష్టించారు.
ఎవరీ భావనా కాంత్..?
బీహార్‌లోని దర్భంగాలో జన్మించిన భావనా కాంత్‌కు విమానాలు నడపడం అంటే మహా ఇస్టం. బయో మెడికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసినా ఆమె టాటా కన్సల్టెన్సీలో టెక్నీషియన్‌గా ఎంపికైంది. అయితే ఆమె దేశ సేవ చేయాలనే ఆసక్తితో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ రాసి వైమానిక దళంలోకి ఎంట్రి ఎచ్చి..అంచలంచెలుగా ఎదగుతూ వచ్చింది.
అలా 2016లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్లుగా నియమితులైన మొదటి ముగ్గురు మహిళలలో ఒకరు. మిగిలిన ఇద్దరు మహిళలు వాణి చతుర్వేది,మోహనా సింగ్. ఈ చర్యతో భారత విమానయాన చరిత్రలో తొలిసారిగా మహిళలకు ఫైటర్ కాక్‌పిట్‌లోకి ప్రవేశం కల్పించేందుకు నాంది పలికింది.
సాధించిన ఘనతలు..
భావనా కాంత్ 2017లో ఫైటర్ స్క్వాడ్రన్‌లో చేరి, మరుసటి సంవత్సరం మిగ్-21 బైసన్‌పై తన తొలి సోలో ఫ్లైట్‌ను పూర్తి చేశారు.ఆ తర్వాత భారత వైమానిక దళం (IAF) అత్యంత అధునాతన యుద్ధ విమానాలలో ఒకటైన సుఖోయ్-30MKIని నడిపే స్థాయికి ఎదిగారు. దీంతో 2020లో, మహిళా దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి చేతుల మీదుగా భావనాకు 'నారీ శక్తి పురస్కార్' లభించింది.
2024లో, రియాద్‌లో జరిగిన 'వరల్డ్ డిఫెన్స్ షో'ను సందర్శించిన భారతీయ మహిళా అధికారుల త్రివిధ దళాల ప్రతినిధి బృందంలో భావన కాంత్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో అతిథిగా ప్రసంగిస్తూ.. రక్షణ దళాలలో నాయకత్వ, కమాండ్ బాధ్యతలతో సహా మహిళలకు మరిన్ని అవకాశాలను కల్పించాల్సిన ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పారు. అలాంటి ఆమె ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫైటర్ కంబాట్ లీడర్ (ఎఫ్‌సీఎల్) కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తొలి మహిళా టాప్‌గాన్ పైలట్‌గా రికార్డు సృష్టించింది. ఆమె సాధించిన ఘనతలకు ఫిదా అవుతూ సెల్యూట్ మేడమ్ అంటూ నటుడు మాధవన్ ప్రశంసలతో ముంచెత్తారు.
సైన్యంలో చేరాలన్నది చిన్ననాటి కల..
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హీరో మాధవన్ చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశించడానికి చాలా కాలం ముందే భారత సైనిక యూనిఫాం ధరించాలని కోరుకున్నారు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో తన ప్రారంభ రోజులను గడిపినప్పటికీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఆ మార్గంలో కొనసాగలేకపోయారు. అయితే పాఠశాల, కళాశాల రోజుల్లోనే NCCతో ఆయనకు అనుబంధం మొదలైంది. ఆ సమయంలో ఆయన చూపిన అంకితభావం, ప్రతిభకు గాను 'మహారాష్ట్ర ఉత్తమ NCC క్యాడెట్'గా గుర్తింపు పొందారు.


