భారత టెలివిజన్ చరిత్రలో 1980వ దశకం ఒక సువర్ణ అధ్యాయం. ఆ కాలంలో దూరదర్శన్‌లో ప్రసారమైన పలు కార్యక్రమాలు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. అప్పట్లో కేవలం వినోదం మాత్రమే కాకుండా, దేశ సంస్కృతిని, వైవిధ్యాన్ని ప్రతిబింబించే అద్భుతమైన కార్యక్రమాలు టీవీ స్క్రీన్లపై కనిపించేవి. నాటి సమయంలో అంటే 40 ఏళ్ల క్రితం రైల్వే శాఖ స్పాన్సర్‌షిప్‌తో తెరకెక్కిన ఒక అరుదైన సీరియల్ ‘యాత్ర’. ఆ సీరియల్ దేశప్రజలను అమితంగా ఆకట్టుకుంది.
రైలు ప్రయాణాల మధుర జ్ఞాపకాలు
రైలు ప్రయాణం అంటేనే ఒక ప్రత్యేకమైన అనుభూతి. దేశంలోని నలుమూలలకు చెందిన వ్యక్తులు ఒకే చోట కలుసుకోవడం కొత్త అనుభూతినిస్తుంది. సినిమాల్లోని ఐకానిక్ రైలు సన్నివేశాలు మొదలు దేశ విభజన నాటి కదిలించే ఘట్టాల వరకు రైళ్లు ఎన్నో భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచాయి. రైలు ప్రయాణాల నేపథ్యంలో రైల్వేశాఖ స్వయంగా స్పాన్సర్ చేసిన ఒక అద్భుతమైన టెలివిజన్ సీరియల్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
శ్యామ్ బెనెగల్ అద్భుత సృష్టి 'యాత్ర'
ప్రముఖ దిగ్గజ దర్శకుడు శ్యామ్ బెనెగల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఆ 15 ఎపిసోడ్ల సీరియల్ ‘యాత్ర’. 1986లో సంచలనం సృష్టించింది. రైలు ప్రయాణాలలో ప్రజల దైనందిన జీవితాలు, వారిలోని ప్రత్యేక క్షణాలు, భావోద్వేగాల కథాంశంతో ఈ సీరియల్‌ను అత్యంత సహజంగా తెరకెక్కించారు. నాటి కాలంలో ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేసిన అరుదైన ప్రయోగాత్మక సీరియల్ అది.
ఓం పురి, నీనా గుప్తా ప్రధాన పాత్రల్లో ..
ఈ 15 ఎపిసోడ్ల ప్రయాణంలో భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన ఎంతోమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఓం పురి, నీనా గుప్తా ప్రధాన పాత్రల్లో నటించగా.. ఎలా అరుణ్, మోహన్ గోఖలే, రవి ఝాంకల్, రాజేంద్ర గుప్తా, నిఖిల్ భగత్, ఇషితా అరుణ్, హరీష్ పటేల్ వంటి ప్రతిభావంతులైన తారలు ఇందులో తమ అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
దేశాన్ని చుట్టబెట్టిన హిమ్‌సాగర్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం
హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, 1986లో వచ్చిన ‘యాత్ర’ సీరియల్‌లోని ఎపిసోడ్లను హిమ్‌సాగర్ ఎక్స్‌ప్రెస్, త్రిపుర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చిత్రీకరించారు. కన్యాకుమారి నుండి జమ్ము తావి వరకు, అలాగే జైసల్మేర్ నుండి డూమ్ డూమా వరకు ఉన్న దూర ప్రాంతాలను, అక్కడి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఈ సీరియల్ ద్వారా ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపించారు.
భారతీయ రైల్వేల సహకారం
దర్శకుడు శ్యామ్ బెనెగల్ స్వయంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ బృహత్ ప్రాజెక్టుకు భారతీయ రైల్వే శాఖ పూర్తి నిధులు సమకూర్చడమే కాకుండా అడుగడుగునా సహకరించింది. దేశంలోని సాధ్యమైనంత సుదీర్ఘమైన రెండు రైలు ప్రయాణాలను ఎంచుకుని ఈ షూటింగ్ పూర్తి చేశారు. అనేక రైల్వే స్టేషన్లలో యూనిట్ కోసం ప్రత్యేకంగా రైళ్లను నడిపించడం, మార్గం సుగమం చేయడం వంటి ఏర్పాట్లు రైల్వే శాఖ చేయడం విశేషం.
రాజస్థాన్ వెన్నెల రాత్రులు.. సాహసాలు
ఈ సీరియల్ షూటింగ్ సమయంలో చిత్ర బృందం ఎన్నో అద్భుతమైన అనుభవాలను చవిచూసింది. రాజస్థాన్ లోని జైసల్మేర్‌లో రాత్రి సమయంలో అద్భుతమైన వెన్నెల దృశ్యాలను చిత్రీకరించారు. అక్కడ కల్బేలియా జానపద నృత్య బృందం ప్రదర్శన ఇవ్వడం యూనిట్‌కు మరువలేని అనుభూతిని మిగిల్చింది. మధ్యప్రదేశ్‌లోని అడవుల్లో పౌర్ణమి రాత్రి బస చేసినప్పుడు ఎదురైన చిన్నపాటి ఉత్కంఠభరిత క్షణాలు ఊహించడం కూడా కష్టమే అంటారు అలనాటి నటులు.
ఇది కూడా చదవండి: హీరోయిన్లతో ‘గోవిందా’ లీలలు.. బజారుకీడుస్తున్న సునీత!


