ముగిసిన వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా | Lok Sabha Adjourned Sine Die: Monsoon Session Ends Early Amid Protests | Sakshi
Sakshi News home page

ముగిసిన వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా

Aug 13 2026 11:13 AM | Updated on Aug 13 2026 12:55 PM

Monsoon session Lok Sabha adjourned sine die

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. చివరిరోజు కేవలం వందేమాతర గీతాలాపనకు లోక్‌సభ పరిమితం కాగా.. రాజ్యసభలో మాత్రం కాసేపు చర్చా..రచ్చ నడిచింది. ఈ తరుణంలో ఆనవాయితీగా ప్రధాని ఇచ్చిన టీ పార్టీ ఆసక్తికర చర్చకు దారి తీసింది. 

లోక్‌సభ నిరవధిక వాయిదా తర్వాత ప్రధాని మోదీ  లోక్‌సభలోని అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లకు టీ పార్టీ ఇచ్చారు. అయితే దానిని విపక్షాలు బహిష్కరించాయి. బదులుగా పార్లమెంట్‌ ఆవరణలో కాసేపు కేంద్ర వ్యతిరేక నినాదాలతో నిరసనలు చేశాయి. అయితే డీఎంకే తరఫున కనిమొళి మాత్రం హాజరయ్యారు. ఆ వెంటనే మోదీ, అమిత్‌షా పార్లమెంట్‌ భవన్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మరోవైపు.. 

అధికార-ప్రతిపక్ష సవాళ్ల నడుమ చివరిరోజు ఉభయ సభల్లో ఏం జరగబోతుందా? అనే ఉత్కంఠకు ఉత్తినే తెర పడింది. లోక్‌సభ ప్రారంభం కాకుండానే నిరవధిక వాయిదా పడింది. గురువారం లోక్‌సభకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, విపక్ష నేత రాహుల్‌ గాంధీ సహా అంతా హాజరయ్యారు. ఎలాంటి చర్చకైనా సిద్ధమని కేంద్రం ప్రకటించడం.. నిలదీసి తీరతామని విపక్షాలు ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది. కానీ, వందేమాతర ఆలాపన తర్వాత నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. అయితే రాజ్యసభ మాత్రం కాసేపు తన కార్యకలాపాలు కొనసాగించింది. 

విపక్షాలపై కిరెన్‌ రిజిజు ఫైర్‌
పార్లమెంట్‌ కార్యకలాపాలను అడ్డుకుంటున్న విపక్ష సభ్యుల తీరుపై పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు విపక్షాలు ఎలాంటి సంప్రదాయాలు నేర్పిస్తున్నాయంటూ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన పార్లమెంట్‌ను నినాదాలు, నిరసనలకు వేదికగా మార్చడం సరికాదని పేర్కొన్నారు. నినాదాలు చేయాలంటే రోడ్లపై చేయొచ్చని.. కానీ పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిందేనని రిజిజు స్పష్టం చేశారు. పార్లమెంట్‌ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపైనా ఉందని అన్నారు.

పెద్దల సభలో రగడ
ఇవాళ రాజ్యసభలో మాత్రం కాసేపు కార్యకలాపాలు జరిగాయి. మైనింగ్‌ బిల్లుపై చర్చ.. ఆపై ఆమోదం లభించింది. అయితే కాసేపటికే రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ‘శుద్ది’ ఆరోపణలతో పెద్దల సభ వేడెక్కింది. తాను పాల్గొన్న ఉత్తరాఖండ్‌ ర్యాలీలో వేదికను శుద్ధి చేశారని.. ఇది అంటరానితనం, దళిత వ్యతిరేక చేష్ట అని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా ఆరోపణపై విచారణ జరిపిస్తామన్నారు. 

అనంతరం.. ‘‘హోం మంత్రి అమిత్‌షా ఎక్కడ?.. విద్యార్థులపై పోలీసు చర్యకు సమాధానం ఇవ్వరా?’ అంటూ విపక్షాలు నినాదాలు చేశాయి. దీంతో చైర్మన్‌ కాసేపు సభను వాయిదా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభం కాగా.. విపక్షాల ఆందోళనలు కొనసాగడంతో రాజ్యసభను సైతం నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

జులై 20వ తేదీన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. మొత్తం 18 రోజులపాటు(ఇవాళ్టితో కలిపి 19) వాయిదాలకే సరిపోయింది. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. ఒక్క పరీక్షా సవరణ బిల్లుపై చర్చ మినహాయించి మరేయితర అంశంపై సరైన చర్చ నడవలేదు. నిరసనల నడుమే కేంద్రం కూడా మూజువాణి ఓటుతో పలు బిల్లులకు ఆమోదం తెలపడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement