ఎర్రకోట ఘటన: యూఎన్‌ నివేదికలో షాకింగ్‌ విషయాలు | Red Fort Blast: UN Reveals Al-Qaeda Link Secret Cell Strategy Exposed | Sakshi
Sakshi News home page

ఎర్రకోట ఘటన: యూఎన్‌ నివేదికలో షాకింగ్‌ విషయాలు

Aug 13 2026 10:39 AM | Updated on Aug 13 2026 11:00 AM

Red Fort Blast: UN Reveals Al-Qaeda Link Secret Cell Strategy Exposed

ఎర్రకోట బాంబు పేలుడు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడి వెనుక అల్‌ఖైదా అనుబంధ సంస్థ ప్రమేయం ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి ఓ నివేదిక విడుదల చేసింది. అంతేకాదు..  దక్షిణాసియాలో ఉగ్రవాద నెట్‌వర్క్‌లు విస్తరిస్తున్నాయన్న ఈ ఘటన ఉదాహరణగా నిలిచిందని చెబుతూనే.. పలు షాకింగ్‌ విషయాలను బయటపెట్టింది.

2025 నవంబర్‌ 10 సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట (రెడ్‌ఫోర్ట్‌) సమీపంలో లాల్‌ కిలా మెట్రో స్టేషన్‌ గేట్‌ వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఈ దాడి అల్‌ఖైదా ఇన్‌ ది ఇండియన్‌ సబ్‌కాంటినెంట్‌ (AQIS) పనేనని ఐరాస భద్రతా మండలి పర్యవేక్షణ బృందం తెలిపింది.

గతంలో పెద్ద స్థాయిలో కార్యకలాపాలు సాగించిన ఉగ్ర సంస్థలు ఇప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నాయని యూఎన్‌ వెల్లడించింది. అల్‌ఖైదా ఇన్‌ ది ఇండియన్‌ సబ్‌కాంటినెంట్‌ కూడా చిన్న చిన్న రహస్య సెల్స్‌ ద్వారా కార్యకలాపాలు సాగిస్తోందని.. లాజిస్టిక్స్‌, ఆర్థిక నెట్‌వర్క్‌లను బలోపేతం చేసుకుంటోందని.. అక్కడి నుంచి ాడులు జరుపుతోందని నివేదిక వెల్లడించింది. భద్రతా సంస్థలకు చిక్కకుండా ఉండేందుకు వికేంద్రీకృత నెట్‌వర్క్‌లను ఉగ్ర సంస్థలు ఉపయోగిస్తున్నాయని హెచ్చరించింది.

కొనసా..గుతున్న దర్యాప్తు
ఎర్రకోట పేలుడు ఘటనపై భారత దర్యాప్తు సంస్థలు లోతైన దర్యాప్తు జరుపుతున్నాయి. పలువురిని అదుపులోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA).. పేలుడు వెనుక ఉన్న కుట్ర, నిధుల మార్గాలు, ఉగ్ర నెట్‌వర్క్‌లపై దృష్టి సారించింది. ఈ మధ్యలో మరికొన్ని కుట్రలు వెలుగులోకి రావడం గమనార్హం. 

అయితే రెడ్‌ఫోర్ట్‌ పేలుడు వ్యవహారంలో ఉగ్ర నెట్‌వర్క్‌ల పాత్రపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. సరిహద్దు దాటి పనిచేస్తున్న ఉగ్ర సంస్థలపై అంతర్జాతీయ స్థాయిలో కఠిన చర్యలు అవసరమని భారత్‌ పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. మరోవైపు ఈ తరహా ఆరోపణలపై పాకిస్థాన్‌ సాధారణంగా తనపై వచ్చే ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది. ఉగ్రవాదానికి తాము మద్దతు ఇవ్వడం లేదని ఇస్లామాబాద్‌ పేర్కొంటోంది.

బంగ్లాదేశ్‌పై కన్ను?
అల్‌ఖైదా ఐఎస్‌(AQIS) తన కార్యకలాపాలను విస్తరించేందుకు బంగ్లాదేశ్‌ను వేదికగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందని యూఎన్‌ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణాసియాలో కొత్త సెల్స్‌ను ఏర్పాటు చేసి ప్రాంతీయ స్థాయిలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని ఈ సంస్థ ప్రయత్నిస్తోందని పేర్కొంది.

పాకిస్థాన్‌–అఫ్గానిస్థాన్‌ ఉద్రిక్తతల మధ్య...
పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉగ్ర దాడులపై కూడా యూఎన్‌ నివేదిక ప్రస్తావించింది. తెహ్రీక్‌-ఏ-తాలిబన్‌ పాకిస్థాన్‌ (TTP) దాడులు పెరగడం, వాటికి ప్రతిగా పాకిస్థాన్‌ చర్యలు తీసుకోవడం వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయని తెలిపింది. అల్‌ఖైదా అనుబంధ గ్రూపులు పాకిస్థాన్‌లోని కొన్ని దాడులతో సంబంధం కలిగి ఉన్నాయని కూడా నివేదిక పేర్కొంది.

ఉగ్రవాదుల చేతుల్లో ఏఐ ఆయుధం?
ఉగ్ర సంస్థలు ఇప్పుడు ఆధునిక టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటున్నాయని యూఎన్‌ హెచ్చరించింది. బాంబుల తయారీ సమాచారం, లక్ష్యాల ఎంపిక వంటి అంశాల కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాధనాలను వినియోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. ఇస్లామిక్‌ స్టేట్‌ ఖొరాసాన్‌ ప్రావిన్స్‌ (ISIL-K) కూడా ఏఐ సాయంతో ప్రచార కంటెంట్‌ను పలు భాషల్లో వేగంగా వ్యాప్తి చేస్తోందని వెల్లడించింది.

మారుతున్న ఉగ్ర వ్యూహాలు.. పెరుగుతున్న ముప్పు
ఉగ్ర సంస్థలు కేవలం ఆయుధాలతో కాకుండా ఫైనాన్స్‌, డిజిటల్‌ ప్రచారం, చిన్న సెల్స్‌, కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తూ తమ నెట్‌వర్క్‌లను బలోపేతం చేసుకుంటున్నాయని యూఎన్‌ పేర్కొంది. రెడ్‌ఫోర్ట్‌ పేలుడు ఘటనను AQISతో అనుసంధానించడం భారత్‌కు అత్యంత కీలక పరిణామంగా మారింది. దక్షిణాసియాలో అల్‌ఖైదా అనుబంధ సంస్థలు మళ్లీ పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఈ నివేదిక కొత్త హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement