పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నా.. అధికార, విపక్షాల మధ్య నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు మాత్రం తెరపడలేదు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి నుంచి.. నిన్నటి వరకు ఉభయ సభల్లో వాయిదాల పర్వమే కొనసాగింది. 18 రోజుల పాటు విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల చర్యలపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు.. మరోవైపు సభలను నడిపేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలు.. వెరసి పార్లమెంట్ వేదికగా రాజకీయ వేడి కొనసాగింది.
లోక్‌సభ, రాజ్యసభల కార్యకలాపాల సమయం కంటే వాయిదాలు, నిరసనలకే ఎక్కువ సమయం పోయింది. చివరి దశలో పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ కావడం ఆసక్తి రేపినా.. ప్రతిష్టంభనకు మాత్రం తెరపడలేదు. నిరసనల మధ్యే పలు కీలక బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదం పొందగా.. సభ వెలుపల కూడా అధికార, విపక్ష ఎంపీల పోటాపోటీ నినాదాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఇక వర్షాకాల సమావేశాల ఇవాళ చివరి రోజు కూడా అదే ఉత్కంఠ కొనసాగుతోంది. చర్చకు ప్రభుత్వం సిద్ధమంటోంది.. బాధ్యతపై నేరుగా సమాధానం కావాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో పార్లమెంట్ ఫైనల్ షోలో చర్చకు తెరలేస్తుందా?.. లేక మరోసారి చిచ్చు రగులుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
చర్చకు సిద్ధం: అమిత్ షా
విద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యలపై ఏ అంశాన్నైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. తానేం పారిపోలేదని.. రోజూ పార్లమెంట్‌కు వచ్చి తన ఛాంబర్‌లోనే కూర్చుకుంటున్నానని.. ఉద్దేశపూర్వకంగా విపక్షాలు సభల్ని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు సుదీర్ఘ చర్చ కొనసాగించేందుకు సిద్ధమని స్పీకర్‌కు తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో సమస్యలకు పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమని.. ప్రభుత్వానికి దాచాల్సింది ఏమీ లేదని అమిత్ షా స్పష్టం చేశారు. విపక్షాలు లేవనెత్తే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తానని తెలిపారు. అయితే అమిత్ షా ప్రతిపాదనకు విపక్షాలు అంగీకరించలేదు. చర్చకు ముందు బాధ్యతపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశాయి.
‘ఆదేశాలు ఎవరివి?’.. రాహుల్ ప్రశ్న
ఇన్నాళ్లు సభకు రాకుండా భయపడి.. ఇప్పుడు అభూత కల్పన కథలు చెబితే వినడానికి ఎవరూ సిద్ధంగా లేరని లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అంటున్నారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్, లాఠీచార్జ్, బలప్రయోగానికి ఆదేశాలు ఎవరు ఇచ్చారో ముందుగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదేశాలు ఇచ్చింది అమిత్ షా అయితే రాజీనామా చేయాలన్నారు. ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ హోంశాఖ పరిధిలోనే ఉంటాయని గుర్తుచేస్తూ.. ఈ అంశంపై కేంద్రం సమాధానం చెప్పాల్సిందేనని ఆయన అన్నారు.
తప్పించుకుంటోంది ఎవరు?
విపక్షాల తీరును ప్రభుత్వం తప్పుబట్టింది. చర్చకు డిమాండ్ చేసిన వారే ఇప్పుడు చర్చకు రావడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. హోంమంత్రి స్వయంగా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. విపక్షాలు సభను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. నినాదాలు, ఆందోళనల మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. అయితే.. హోం మంత్రి ఇన్నాళ్లపాటు సభకు వచ్చేందుకు భయపడ్డారని.. ఆయన ఇప్పుడు ఇచ్చే సమాధానం ఎవరికి కావాలని, విద్యార్థులపై పోలీసు చర్యలకు ఆదేశాలిచ్చింది ఆయనో కాదో తేల్చాలని, కారకుడు ఆయనే గనుక అయితే రాజీనామా చేయాలని విపక్షాలు మండిపడుతున్నాయి.
విద్యార్థుల ఆందోళనలే ప్రధాన అజెండా
నీట్ పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థులపై పోలీసుల చర్యలే ఈ సమావేశాల్లో ప్రధాన రాజకీయ అంశాలుగా మారాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో పెల్లెట్ గన్స్, లాఠీచార్జ్, టియర్ గ్యాస్ వినియోగంపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి.
అయితే.. మొత్తం సమావేశాల్లో ఒకే అంశంపై సభ సజావుగా సాగింది. పరీక్షల అక్రమాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన పరీక్షా సవరణ బిల్లుపై జరిగిన చర్చ ప్రశాంతంగా జరిగింది. ఈ బిల్లుపై అధికార, విపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించగా.. ఎలాంటి తీవ్ర అంతరాయం లేకుండా సభ కార్యకలాపాలు కొనసాగాయి. ఆ తర్వాత మాత్రం మళ్లీ విద్యార్థుల ఆందోళనలు-పోలీసుల చర్యల అంశంపై రాజకీయ రగడ కొనసాగింది.
నిరసనల మధ్య కీలక బిల్లులు
పార్లమెంట్‌లో రాజకీయ రగడ కొనసాగినప్పటికీ.. శాసనపరమైన కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోలేదు. అధికార, విపక్షాల నినాదాల మధ్యే పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది.
వందేమాతరం గౌరవం, జాతీయ చిహ్నాల పరిరక్షణకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసే సవరణలకు ఆమోదం లభించింది. వందేమాతరం అవమానాన్ని కూడా నేరంగా పరిగణించేలా చట్టంలో మార్పులు చేశారు.
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) పరిశీలనకు పంపాలని నిర్ణయించారు. విదేశీ నిధులపై పర్యవేక్షణ, నిబంధనల కఠినతరం ఈ బిల్లులో ప్రధాన అంశాలు.
మరోవైపు కేరళ రాష్ట్ర పేరును అధికారికంగా ‘కేరళం’గా మార్చే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అలాగే జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (NCDC) సవరణ బిల్లుకు కూడా రాజ్యసభ ఆమోదం తెలిపింది.
చివరి రోజైనా తెరపడేనా?
వర్షాకాల సమావేశాల చివరి రోజు ఇప్పుడు కీలకంగా మారింది. ప్రభుత్వం చర్చకు సిద్ధమని చెబుతుండగా.. విపక్షాలు మాత్రం బాధ్యతపై స్పష్టమైన సమాధానం కోసం పట్టుబడుతున్నాయి. 18 రోజులుగా సాగుతున్న పార్లమెంట్ పోరుకు చివరి రోజు అయినా ముగింపు లభిస్తుందా?.. లేదంటే ఫైనల్ షో కూడా మరో రాజకీయ చిచ్చుతోనే ముగుస్తుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.


