ప్రభుత్వ పాఠశాలల్లో 73% డ్రాపౌట్ | 73 percent Dropout Rate Parliamentary Panel Exposes Public Schools | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో 73% డ్రాపౌట్

Aug 13 2026 8:15 AM | Updated on Aug 13 2026 8:15 AM

73 percent Dropout Rate Parliamentary Panel Exposes Public Schools

దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యవస్థ తీవ్ర మౌలిక, నిర్మాణాత్మక సవాళ్లతో కొట్టుమిట్టాడుతోందని పార్లమెంటరీ అంచనాల కమిటీ (కమిటీ ఆన్‌ ఎస్టిమేట్స్‌-10వ నివేదిక, 2026-27) లోక్‌సభలో ప్రవేశపెట్టిన నివేదిక దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. దేశంలో హయ్యర్ సెకండరీ విద్య పూర్తికాకుండానే ఏకంగా 73 శాతం మంది విద్యార్థులు బడి మానేస్తున్నారని (డ్రాపౌట్) కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్(UDISE 2024-25) డేటా ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక దేశ మానవ వనరుల వికాసానికి ఈ గణాంకాలు తీవ్ర విఘాతమని స్పష్టం చేసింది.

నిర్మాణాత్మక లోపాలు

విద్యా దశలు పెరిగేకొద్దీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతోందని నివేదిక పేర్కొంది. ప్రాథమిక (ప్రైమరీ) స్థాయిలో 6.1 కోట్లకు పైగా ఉన్న విద్యార్థుల చేరికలు అప్పర్ ప్రైమరీ నాటికి 4 కోట్లకు, సెకండరీ స్థాయికి 2.3 కోట్లకు, ఆపై హయ్యర్ సెకండరీ స్థాయికి చేరేసరికి కేవలం 1.6 కోట్లకు పడిపోతున్నాయి. దేశవ్యాప్తంగా 9.11 లక్షలకు పైగా ప్రాథమిక పాఠశాలలు అందుబాటులో ఉండగా హయ్యర్ సెకండరీ విద్యాసంస్థలు కేవలం 90,866 మాత్రమే ఉండటం ఈ అసమానతకు ప్రధాన కారణమని కమిటీ విశ్లేషించింది.

దివ్యాంగ విద్యార్థుల వసతులు.. నిధుల నిరుపయోగం

ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల(CwSN) మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్ర విద్యాశాఖ తీవ్ర విఫలమైందని కమిటీ ఎత్తి చూపింది. దేశంలోని 14.7 లక్షల పాఠశాలల్లో సగానికి పైగా పాఠశాలల్లో హ్యాండ్‌రైల్స్‌తో కూడిన ర్యాంపులు, ప్రత్యేక మరుగుదొడ్లు లేవు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో CwSN మరుగుదొడ్ల నిర్మాణం కోసం కేటాయించిన రూ.4.82 కోట్లలో కేవలం రూ.2.60 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. అలాగే ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకానికి కేటాయించిన రూ.9.62 కోట్లలో కేవలం రూ.80.50 లక్షలు మాత్రమే వెచ్చించడం విద్యాశాఖ నిధుల వినియోగంలో నిర్లక్ష్యాన్ని చాటుతోంది.

సిఫార్సులు

జాతీయ విద్యా విధానం ఆశయాలకు అనుగుణంగా సమ్మిళిత విద్యను అందించాలంటే విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ప్రాథమిక పాఠశాలలను హయ్యర్ సెకండరీ స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలని కమిటీ సూచించింది. కేటాయించిన బడ్జెట్ పూర్తిస్థాయిలో సమర్థవంతంగా ఖర్చయ్యేలా కఠినమైన పర్యవేక్షణ వ్యవస్థను తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement