అమెరికా: కుటుంబ సభ్యుల హత్య.. భారత యువకుడు అరెస్ట్‌ | US Indian origin teen charged with murdering mother brother after kill family searches | Sakshi
Sakshi News home page

అమెరికా: కుటుంబ సభ్యుల హత్య.. భారత యువకుడు అరెస్ట్‌

Aug 13 2026 8:33 AM | Updated on Aug 13 2026 8:54 AM

US Indian origin teen charged with murdering mother brother after kill family searches

మసాచుసెట్స్‌: అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. మసాచుసెట్స్‌లోని యాక్టన్ ప్రాంతంలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల యువకుడు తన తల్లి, తమ్ముడిని దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు అర్జున్ అరవింద్ అనే యువకుడిపై అధికారులు హత్య కేసులు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గత మంగళవారం మార్తా లేన్‌లోని వారి నివాసంలో సుధా వెంకటేశన్ (45), ఆమె చిన్న కుమారుడు సిద్ధార్థ్ అరవింద్ (14) ఇద్దరూ విగతజీవులుగా పడిఉన్నారు. కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో  ఆరోజు ఇంటికి వెళ్లాల్సిన ట్యూటర్ విషయాన్ని అర్జున్‌ తండ్రికి తెలిపారు. దీంతో ఆందోళన చెందిన అర్జున్ తండ్రి సాయంత్రం 6.37 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొదటి అంతస్తులో సిద్ధార్థ్, బేస్‌మెంట్‌లో సుధా మృతదేహాలను గుర్తించారు. ఇద్దరిపైనా తీవ్ర గాయాల ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. హత్య అనంతరం నిందితుడు అర్జున్ తన తల్లి కారులో పరారయ్యాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టగా, బుధవారం ఉదయం వేలాండ్ ప్రాంతంలోని ఒక పార్కింగ్ స్థలంలో కారుతో పాటు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణానికి పాల్పడే ముందు అర్జున్ అనుమానాస్పద రీతిలో ప్రవర్తించినట్లు మిడిల్‌సెక్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం వెల్లడించింది. కుటుంబ సభ్యులను ఎలా అంతం చేయాలనే విషయాలపై అర్జున్‌ ఇంటర్నెట్, చాట్‌జీపీటీ ద్వారా శోధించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ సంచలన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement