పెషావర్: వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు చెందిన రెండు జిల్లాల్లో 36 గంటల పాటు సాగిన నిఘా ఆధారిత వరుస ఆపరేషన్లలో 62 మంది మిలిటెంట్లు హతమైనట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. బన్ను జిల్లాలో 10 మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు. మంగళవారం ఉదయం నుంచి ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలో చేపట్టిన ఇతర ఆపరేషన్లలో నలుగురు కీలక కమాండర్లతో సహా 52 మంది మృతిచెందారు.
ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలో ‘ఫిట్నా అల్–ఖవారిజ్’మిలిటెంట్లపై లక్షిత దాడులు నిర్వహించడానికి ముందు భద్రతా దళాలు అనుమానిత ప్రాంతాలపై నిఘాను కట్టుదిట్టం చేశాయి. ఫిట్నా అల్–ఖవారిజ్ అనేది నిషేధిత తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) కోసం ప్రభుత్వం ఉపయోగించే పదం. చెట్ల పొదల్లో దాక్కున్న ఉగ్రవాదులను గుర్తించడానికి క్వాడ్‌కాప్టర్లను ఉపయోగించారని, దీనివల్ల భద్రతా దళాలు వారిని కచి్చతంగా లక్ష్యంగా చేసుకోగలిగాయని అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఫిట్నా అల్–ఖవారిజ్‌కు చెందిన నలుగురు కీలక కమాండర్లు సైతం ఉన్నట్లు తెలిపారు.


