ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివాహ వేడుకలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ బాంబు దాడిలో పది మంది మృతి చెందగా.. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. అయితే, బాధితులు నిషేధిత తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) హిట్ లిస్ట్‌లో ఉన్నారని సమాచారం. దీంతో, పాకిస్తాన్‌లోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్ అయినట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. పాకిస్తాన్ వాయువ్య ప్రావిన్స్ ఖైబర్ పఖ్తుంఖ్వాలో శుక్రవారం రాత్రి ఓ ఇంట్లో జరిగిన వివాహ వేడుకలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఖురేషి మోర్ సమీపంలోని డేరా ఇస్మాయిల్ ఖాన్‌లో శాంతి కమిటీ చీఫ్ నూర్ ఆలం మెహసూద్ నివాసంలో జరిగిన వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకలో ఆత్మాహుతి బాంబు పేలుడు కారణంగా పది మంది మృతి చెందగా.. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లా పోలీసు అధికారి సజ్జాద్ అహ్మద్ సాహిబ్జాదా ధృవీకరించారు. మృతుల్లో శాంతి కమిటీ కమాండర్ జాగ్రీ మెహసూద్ కూడా ఉన్నారు. కాగా, దాడి జరిగిన సమయంలో పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు నృత్యం చేస్తున్నట్లు సమాచారం. పేలుడు కారణంగా గది పైకప్పు కూలిపోయింది, దీనివల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.
#BREAKING
𝐃𝐞𝐫𝐚 𝐈𝐬𝐦𝐚𝐢𝐥 𝐊𝐡𝐚𝐧 𝐒𝐮𝐢𝐜𝐢𝐝𝐞 𝐁𝐥𝐚𝐬𝐭 𝐊𝐢𝐥𝐥𝐬 𝐎𝐯𝐞𝐫 𝐓𝐞𝐧, 𝐈𝐧𝐜𝐥𝐮𝐝𝐢𝐧𝐠 𝐏𝐞𝐚𝐜𝐞 𝐂𝐨𝐦𝐦𝐢𝐭𝐭𝐞𝐞 𝐋𝐞𝐚𝐝𝐞𝐫𝐬
A suicide bombing struck a wedding ceremony in the Qureshi Mor area of Dera Ismail Khan district, Khyber Pakhtunkhwa, on… pic.twitter.com/KKvtYRi1rx— نقطةNUQTA (@NUQTA31) January 23, 2026
అనంతరం, ఖైబర్ పఖ్తుంఖ్వా రెస్క్యూ 1122 ప్రతినిధి బిలాల్ అహ్మద్ ఫైజీ మాట్లాడుతూ.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఏడు అంబులెన్స్‌లు, ఒక అగ్నిమాపక వాహనం సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. అధికారులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో బాధితులు నిషేధిత తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) హిట్ లిస్ట్‌లో ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే, ఈ దాడికి ఇప్పటివరకు ఏ టెర్రరిస్టు బాధ్యత వహించలేదు. దీనిపై ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం.


