29 మంది మిలిటెంట్లు హతమయ్యారన్న పాక్
పరస్పరం నిరసనలు తెలుపుకున్న ఇరు దేశాలు
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ సరిహద్దుల వెంబడి జరిపిన దాడుల్లో కనీసం 29 మంది మిలిటెంట్లు హతమయ్యారని పాకిస్తాన్ ప్రకటించింది. శనివారం కరాచీలోని పారామిలటరీ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై మిలిటెంట్లు జరిపిన దాడికి ఇది ప్రతిస్పందన అని సమాచార శాఖ మంత్రి అత్తా తరార్ చెప్పారు. నిఘా వర్గాలందించిన పక్కా సమాచారం మేరకు ఖైబర్ ప్రావిన్స్‌లోని బజౌర్ జిల్లా పరిధిలోని జమాత్ ఉల్ అహ్రార్, ఫిత్నా అల్ ఖ్వారిజ్‌లకు చెందిన మూడు స్థావరాలపై ఈ వైమానిక దాడులు జరిగాయన్నారు.
పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ధ్వంసం చేసినట్లు చెప్పారు. కరాచీలోని పాక్ రేంజర్స్ హెడ్డాఫీసుపై దాడికి తమదే బాధ్యతంటూ నిషేధిత జమాతుల్ అహ్రార్ ప్రకటించుకుంది. 2,600 కిలోమీటర్ల పొడవైన అఫ్గాన్ సరిహద్దుల్లోని తాలిబన్ ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్ ఫిబ్రవరిలో ఆపరేషన్ ఘజబ్ లిల్ హక్ పేరుతో కనీసం 53 ప్రాంతాల్లో భారీగా దాడులు చేపట్టింది.
సరిహద్దులకు సమీపంలోని తమ ఖైబర్, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లలో అఫ్గాన్‌లోని తాలిబన్లు ఉగ్రదాడులను ప్రేరేపిస్తున్నారని పాక్ ఆరోపిస్తోంది. తాజాగా పాకిస్తాన్ చేపట్టిన దాడులను అఫ్గానిస్తాన్ ఖండించింది. తమ కునార్, పక్టియా, పక్టికా ప్రావిన్స్‌లపై దాడులకు దిగడాన్ని గగనతల అతిక్రమణ, సార్వభౌమత్వానికి భంగకరమంటూ పాక్ దౌత్యాధికారికి సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్ కూడా కరాచీలోని రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై దాడికి అఫ్గాన్ మిలిటెంట్లే కారణమంటూ ఆ దేశ దౌత్యాధికారికి సమన్లు పంపించింది.


