బలోచిస్తాన్ హోంమంత్రి మీర్ జియావుల్లా లాంగౌ కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందారు. ఈ దాడి నుంచి హోంమంత్రి సురక్షితంగా బయటపడ్డారు. కలత్ నుంచి క్వెట్టా వెళ్తున్న ఈ కాన్వాయ్‌ను మస్తుంగ్ జిల్లాలోని ఖద్కోచా గోరు సమీపంలో సాయుధులు లక్ష్యంగా చేసుకున్నారు. కాల్పుల్లో నలుగురు ఏటీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే షాహీద్ నవాబ్ గౌస్ బక్ష్ రైసాని ఆసుపత్రికి తరలించారు.
పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో జరిగిన ఈ దాడి కలకలం రేపుతుంది. అయితే, ఏ మిలిటెంట్ గ్రూప్ కూడా ఇప్పటివరకు ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు అధికారులు ఆ ప్రాంతంలో దర్యాప్తు చేపట్టారు.
బలోచిస్తాన్ మస్తుంగ్ జిల్లా పదే పదే వార్తల్లో నిలుస్తోంది. బలోచ్ వేర్పాటువాద గ్రూపులు, ఇస్లామిస్ట్ మిలిటెంట్లు ఇద్దరూ ఈ జిల్లాలో దాడులకు పాల్పడుతున్నాయి. 2026 జూలైలో మస్తుంగ్‌లో ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్‌లో ఆత్మాహుతి దళ సభ్యుడితో సహా ఐదుగురు మిలిటెంట్లను హతమార్చినట్లు పాకిస్థాన్ భద్రతా బలగాలు తెలిపాయి. ఈ ఆపరేషన్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లు లభించినట్లు సైన్యం వెల్లడించింది.
అలాగే ఈ ఏడాది జనవరిలో బలోచిస్తాన్ వ్యాప్తంగా భద్రతా సంస్థలు, ప్రభుత్వ భవనాలు, పలు జిల్లాల్లోని ఇతర కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన భారీ దాడి ప్రభావిత ప్రాంతాల్లో ఈ జిల్లా కూడా ఉంది. 2018 జూలైలో ఈ జిల్లాలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో ఆత్మాహుతి దాడి జరగగా 149 మంది మృతి చెందారు. పాకిస్థాన్‌లో అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడులలో ఇది ఒకటిగా నిలిచింది. దీనికి ఇస్లామిక్ స్టేట్ (ISIS) బాధ్యత వహించింది. బలోచిస్తాన్ హోంమంత్రిని లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు.
2016 జనవరిలో అప్పట్లో బలోచిస్తాన్ హోంమంత్రిగా ఉన్న మీర్ సర్ఫరాజ్ అహ్మద్ బుగ్తి డెరా బుగ్తిలో తన కాన్వాయ్‌పై రిమోట్ ద్వారా పేల్చిన బాంబు దాడి నుంచి తప్పించుకున్నారు. డాన్ పత్రిక కథనం ప్రకారం.. కాన్వాయ్‌లోని ఒక వాహనం దెబ్బతిన్నప్పటికీ, బుగ్తి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు బలోచ్ రిపబ్లికన్ ఆర్మీ బాధ్యత వహించింది.


