ఇరాన్‌ నెత్తిన అమెరికా మరో పిడుగు! అవసరమైతే.. | Iran Faces US Shockwave: No End Blockade Plan Unveiled | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ నెత్తిన అమెరికా మరో పిడుగు! అవసరమైతే..

Aug 14 2026 8:49 AM | Updated on Aug 14 2026 9:04 AM

Iran Faces US Shockwave: No End Blockade Plan Unveiled

తమ డిమాండ్లు, షరతుల విషయంలో రాజీ పడబోమని.. అవసరమైతే ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం యుద్ధం కొనసాగిస్తామని ఇరాన్‌ కుండబద్ధలు కొట్టేసింది. ఈ తరుణంలో అమెరికా ఒత్తిడి మరింత పెంచింది. హర్ముజ్‌ జలసంధి తమ నియంత్రణలోనే ఉందంటూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వరుస ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ‘ నో ఎండ్‌ ప్లాన్‌’తో మరింత దూకుడుగా వ్యవహరించాలని ఆయన భావిస్తున్నారు. 

ఇప్పటికే జలసంధిలో నౌకా దిగ్బంధాన్ని (బ్లాకేడ్‌) కొనసాగిస్తున్న అమెరికా సైన్యం.. అవసరమైతే నిరవధికగా ఆ పని చేయాలని భావిస్తోంది. అంటే నిర్దిష్ట కాలపరిమితి అంటూ ఏదీ లేకుండా ఇరాన్‌ పోర్టులకు వచ్చి పోయే నౌకలపై నిఘా కొనసాగించడం(అవసరమైతే దాడులు జరపడం) అన్నమాట.కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోవడం, ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సెత్‌ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో నౌకాదళాన్ని కొనసాగించే సామర్థ్యం అమెరికాకు ఉందని చెప్పారు. అవసరమైనప్పుడు యుద్ధ నౌకలను మార్చుతూ హర్ముజ్‌ ప్రాంతంలో పహారా కొనసాగిస్తామని తెలిపారు.

ఇరాన్‌పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు
నౌకా దిగ్బంధంతో పాటు ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఆంక్షల చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అమెరికా లక్ష్యం ఇరాన్‌ను చర్చల బల్లపైకి తీసుకురావడమేనని వాషింగ్టన్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు విధించిన ఆంక్షలు, ఒత్తిళ్లు ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదని కూడా విశ్లేషణలు ఉన్నాయి.

హర్ముజ్‌ జలసంధే కేంద్రంగా పోరు
అణు ఒప్పందంతో మొదలైన పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఇప్పుడు హర్ముజ్‌ జలసంధి చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రపంచ చమురు, ఎల్‌ఎన్‌జీ రవాణాలో ఈ మార్గం అత్యంత కీలకం. యుద్ధం ప్రారంభానికి ముందు ప్రపంచ చమురు, గ్యాస్‌ సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం ద్వారానే జరిగేది. తమపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్‌ ఈ వ్యూహాత్మక మార్గంపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు హర్ముజ్‌ తమ ఆధీనంలోనే ఉందని ఇరాన్‌ చెబుతోంది.

రెండు చమురు నౌకలపై దాడి
హర్ముజ్‌ జలసంధి గుండా ప్రయాణిస్తున్న అబుదాబి నేషనల్‌ ఆయిల్‌ కంపెనీకి చెందిన రెండు నౌకలపై దాడి జరిగినట్లు యూఏఈ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనకు ఇరాన్‌ కారణమని యూఏఈ ఆరోపించింది. ఈ పరిణామాలతో గల్ఫ్‌ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయి. నౌకల రాకపోకలు కూడా భారీగా తగ్గిపోయాయి.

నౌకల రాకపోకలకు బ్రేక్‌
యుద్ధానికి ముందు హర్ముజ్‌ జలసంధి ద్వారా రోజుకు 130 నుంచి 140 వరకు నౌకలు ప్రయాణించేవి. ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఒక దశలో రోజుకు కేవలం ఎనిమిది నౌకలు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించినట్లు సమాచారం. అమెరికా గతంలో ఇరాన్‌ నౌకలు, పోర్టులపై ఉన్న దిగ్బంధాన్ని కొంతకాలం సడలించినప్పటికీ.. తర్వాత మళ్లీ పునరుద్ధరించింది. దీనివల్ల ఇరాన్‌కు కీలకమైన విదేశీ మారక ఆదాయంపై ప్రభావం పడుతోంది.

ప్రపంచ చమురు మార్కెట్‌లో కలవరం
ఇరాన్‌ సంక్షోభం కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ఈ ఏడాది ప్రపంచ చమురు సరఫరా రోజుకు 43 లక్షల బ్యారెళ్ల మేర తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది దాదాపు 4 శాతానికి సమానం. అయితే మరోవైపు డిమాండ్‌ తగ్గడం, అమెరికా ముడిచమురు నిల్వలు పెరగడంతో చమురు ధరలు కొంత తగ్గాయి. గురువారం ధరలు 2 శాతానికి పైగా పడిపోయాయి.

ట్రంప్‌పై దేశీయ ఒత్తిడి
ఇరాన్‌తో యుద్ధం ముగించాలని అమెరికాలోనూ ఒత్తిడి పెరుగుతోంది. పెరిగిన ఇంధన ధరలు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రజాదరణపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా కీలకంగా మారింది. ట్రంప్‌ ఈ మధ్య హర్ముజ్‌పై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఇరాన్‌ దీనిని ఖండిస్తూ.. ఆంక్షలు ఎత్తివేయడం, తమ నిలిపివేసిన ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులు నెరవేరే వరకు జలసంధిని పూర్తిగా తెరవబోమని స్పష్టం చేసింది.

యుద్ధం కంటే ఆర్థిక దెబ్బే వ్యూహమా?
ఇరాన్‌పై సైనిక చర్యలు చేపడతామని ట్రంప్‌ గతంలో హెచ్చరించినప్పటికీ.. ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా ఇప్పటికే ఇరాన్‌కు ఆయుధాల సరఫరాకు సహకరిస్తున్న వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించింది. ఇరాన్‌ అణ్వాయుధ సామర్థ్యాన్ని పొందకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని హెగ్‌సెత్‌ తెలిపారు.

అబ్రహం లింకన్‌ నౌకపై వదంతులు
హర్ముజ్‌ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ విమాన వాహక నౌకపై సిబ్బంది మరణించారన్న వార్తలను అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ (CENTCOM) ఖండించింది. ఈ యుద్ధం ఆగదని.. తమ జీవితాలు ఇంతేనన్న వైరాగ్యంతో ఏడుగురు నేవీ సిబ్బంది బలవన్మరణానికి పాల్పడ్డారన్నది ఇరాన్‌ మీడియా కథనాల సారాంశం. అయితే అది తప్పు సమాచారమని అమెరికా తెలిపింది. 

260 రోజులకు పైగా సముద్రంలో ఉన్నప్పటికీ అబ్రహం లింకన్‌ క్యారియర్‌ గ్రూప్‌ సిబ్బంది ధైర్యంగా ఉన్నారని CENTCOM పేర్కొంది. ఆగస్టు 3న సముద్రంలో పడిపోయిన ఒక నావికుడిని కూడా సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించింది. ఈ తరుణంలో.. లింకన్‌ నౌకను ఒడ్డుకు రప్పించి జార్జ్‌ వాషింగ్టన్‌ నౌకతో రిప్లేస్‌  చేశామని, ఇది సాధారణ చర్యేనని ప్రకటించుకుంది.

హర్ముజ్‌ జలసంధిపై ఆధిపత్య పోరు ఇప్పుడు అమెరికా–ఇరాన్‌ ఘర్షణలో కీలక అంశంగా మారింది. ఒకవైపు అమెరికా నిరవధిక బ్లాకేడ్‌, ఆర్థిక ఆంక్షలతో ఒత్తిడి పెంచుతుండగా.. మరోవైపు ఇరాన్‌ వ్యూహాత్మక మార్గాన్ని తన ఆధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ పోరు ఎంతకాలం కొనసాగుతుందన్నది చమురు మార్కెట్లతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement