బయటినుంచి సలహాదారుగా కొనసాగనున్న కరోలిన్
వాషింగ్టన్: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ రాజీనామా చేశారు. ఆగస్టు నెలాఖరులో పదవి నుంచి వైదొలగనున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బయటినుంచి సలహాదారుగా కొనసాగుతారు. తన ఇద్దరు పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి వైట్‌హౌస్‌లోని ఈ ఒత్తిడితో కూడిన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఉన్నత స్థాయి పదవిని చేపట్టిన వారిలో అత్యంత చిన్న వయస్సు వ్యక్తైన లెవిట్, తన 18 నెలల పదవీకాలంలో ట్రంప్‌కు గట్టి విధేయురాలిగా పేరు సంపాదించారు.
వైట్‌హౌస్ బ్రీఫింగ్ సమయంలో విలేకరులతో తీవ్ర వాగ్వాదాలకు దిగి నిత్యం వార్తల్లో నిలిచారు. 28 ఏళ్ల లెవిట్.. మే నెలలో తన రెండో బిడ్డకు జన్మనిచ్చారు. ప్రసూతి సెలవు తర్వాత ఇటీవలే వైట్‌హౌస్‌కు తిరిగి వచ్చారు. అయితే, కష్టమైన ఉద్యోగమైన ప్రెస్‌సెక్రటరీగా, తల్లిగా తన బాధ్యతలను సమతుల్యం చేసుకోవడం కష్టంగా మారిందని రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. రెండు బాధ్యతలకు సంపూర్ణంగా న్యాయం చేయలేనని గ్రహించానన్నారు.
ప్రెస్ సెక్రటరీ పదవి తన జీవితంలో లభించిన గొప్ప గౌరవంగా అభివర్ణించారు. అయితే, లెవిట్ వైట్‌హౌస్ నుంచి నిష్క్రమించినా రాజకీయ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారని, బయటి కమ్యూనికేషన్స్ సలహాదారుగా పనిచేస్తారని, ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ ఉద్యమంతో కలిసి పనిచేస్తారని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. లెవిట్ పనితీరును ప్రశంసిస్తూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఆమెను వైట్ హౌస్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రెస్ సెక్రటరీల్లో ఒకరిగా అభివర్ణించారు.
2018 నుంచి 2024 ఎన్నికల ప్రచారం వరకు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. ఇదిలా ఉండగా, జులైలో టర్కీలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ట్రంప్ భద్రతా చర్యలు మీడియాకు తెలిసిన సమయంలో లెవిట్ నిష్క్రమణ చర్చనీయాంశమవుతోంది. అధ్యక్షుడితో ప్రయాణించే జర్నలిస్టులకు ఆయన కదలికల గురించి తెలిసేలా చూసుకునే సాధారణ పద్ధతికి విరుద్ధంగా జరగడం ఆమె నిష్క్రమణకు కారణమైందనే చర్చ జరుగుతోంది.
అతి పిన్న వయస్కురాలైన ప్రెస్ సెక్రటరీ
2025 జనవరిలో 26 ఏళ్లవయసులో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా నియమితులైన అతి చిన్న వయస్కురాలిగా ఆమె నిలిచారు. వార్తా మాధ్యమాలతో వైట్ హౌస్ సంబంధాలను పునర్వ్యవస్థీకరించారు. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెంగ్‌తో కలిసి పనిచేస్తూ, ఏ జర్నలిస్టులకు అధ్యక్షుడిని కలిసే అవకాశం ఇవ్వాలనే నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడంలో సహాయపడ్డారు.
వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ రొటేటింగ్ ప్రెస్ పూల్‌ను నిర్ణయించే సాంప్రదాయ వ్యవస్థనుంచి తొలగించారు. బదులుగా, పరిపాలన పాడ్‌కాస్ట్‌లు, న్యూస్‌లెటర్‌లు, కొత్త డిజిటల్ మాధ్యమాలకు ఎక్కువ పాధాన్యత ఇచ్చారు. బ్రీఫింగ్ గదిలో ప్రత్యేకంగా న్యూ మీడియా సీటును సృష్టించారు. అయితే, ఈ కొత్త వ్యవస్థ సానుభూతి కవరేజీ మాధ్యమాలకు అనుకూలంగా వ్యవహరించే పరిపాలనకు అవకాశం కల్పిస్తుందని విమర్శించారు.


