భారత్‌లో పుట్టిన మీనా, మినాల్ చిన్న వయసులోనే వేర్వేరు డచ్ కుటుంబాలకు దత్తతగా వెళ్లారు. 1996లో దత్తత పిల్లల కోసం నిర్వహించిన ఒక కార్యక్రమంలో వారు తొలిసారి కలుసుకున్నారు. ఆ సమయంలో వారు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో నివసించేవారు. మొదటి పరిచయంతోనే ఇద్దరి మధ్య బలమైన అనుబంధం ఏర్పడింది. వారి రూపురేఖలు, స్వభావంలో ఉన్న పోలికలు చూసి స్నేహితులు కూడా ఆశ్చర్యపోయారు. తర్వాత వారు స్నేహితులుగా మారి చిరునామాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
కొన్ని ఏళ్ల తర్వాత ఇద్దరి మధ్య సంబంధం తెగిపోయింది. దాదాపు 15 ఏళ్ల పాటు ఒకరి గురించి మరొకరికి సమాచారం లేకపోయింది. అనంతరం మీనా డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోవాలని నిర్ణయించుకుంది. అలాగే, వేరే ప్రాంతంలో మినాల్ కూడా డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకుంది. ‘‘మైహెరిటేజ్’’ డీఎన్‌ఏ పరీక్ష ఫలితాల్లో మీనా, మినాల్ మధ్య 100% సరిపోలిక కనిపించింది. దీంతో వారు కేవలం స్నేహితులు మాత్రమే కాదని, నిజానికి రక్తసంబంధం ఉన్న అక్కాచెల్లెళ్లు అని బయటపడింది.
ఈ విషయం తెలిసిన తర్వాత ఇద్దరూ నెదర్లాండ్స్‌లో మళ్లీ కలుసుకున్నారు. ఎంతో భావోద్వేగభరితంగా మాట్లాడుకున్నారు. చాలా ఏళ్లుగా తన హృదయంలో ఏదో వెలితి ఉన్నట్టుగా అనిపించేదని మీనా చెప్పింది. ఇప్పుడు తప్పిపోయిన పజిల్ ముక్క దొరికినట్టుగా ఉందని ఆమె పేర్కొంది. తన సోదరిని చూసి “నిన్ను చూస్తే ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది” అని చెప్పింది.
ప్రస్తుతం 43 ఏళ్ల మీనా ముగ్గురు పిల్లల తల్లి. 44 ఏళ్ల మినాల్ ప్రేమాభిమానాలతో నిండిన డచ్ కుటుంబంలో తోబుట్టువుల మధ్య పెరిగింది. “మేము సోదరీమణులు కావడానికి ముందే స్నేహితులం. నిజానికి మేము ఎప్పటినుంచో అక్కాచెల్లెళ్లమే, కానీ ఆ విషయం మాకు తెలియదు” అని మినాల్ తెలిపింది.
కాగా, మైహెరిటేజ్ అనేది కుటుంబ వంశవృక్షం, పూర్వీకుల వివరాలు తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక ప్రముఖ ఆన్‌లైన్ సంస్థ. ఈ సంస్థ నిర్వహించే డీఎన్‌ఏ పరీక్ష జన్యు సమాచారాన్ని విశ్లేషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తమ డేటాబేస్‌లో ఉన్న ఇతర వ్యక్తుల డీఎన్‌ఏతో పోల్చుతుంది. మీకు తెలియని బంధువులను గుర్తించే అవకాశం ఇస్తుంది. మీ కుటుంబ మూలాలు, పూర్వీకులు ఏ ప్రాంతాలకు చెందినవారో తెలుసుకునే సమాచారం అందిస్తుంది.


