ఐక్యరాజ్యసమితి సిబ్బందిని అరెస్టు చేసిన తాలిబాన్ | Taliban Detains Two UN Political Mission Staff Members in Afghanistan | Sakshi
Sakshi News home page

ఐక్యరాజ్యసమితి సిబ్బందిని అరెస్టు చేసిన తాలిబాన్

Aug 13 2026 4:19 PM | Updated on Aug 13 2026 5:22 PM

Taliban rulers detain two members of the UN political mission

కాబూల్‌: అఫ‍్గానిస్థాన్‌లోని ఐక్యరాజ్యసమితి రాజకీయ మిషన్ (యూఎన్ఏఎంఏ)కు చెందిన ఇద్దరు అఫ్గాన్‌ సిబ్బందిని తాలిబాన్ పాలకులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి అధికారికంగా ప్రకటించింది. తాలిబాన్‌కు చెందిన జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ విభాగం, పశ్చిమ ఆఫ‍్గానిస్థాన్‌లోని హెరాత్ నగరంలో ఈ ఇద్దరు సిబ్బందిని ఆదివారం అరెస్టు చేసినట్టు ఐక్యరాజ్యసమితి డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ విలేకరులకు తెలిపారు. 

వీరిపై మోపిన ఆరోపణలు ఏమిటో తమకు తెలియజేయలేదని, వారిని కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని హక్ వెల్లడించారు. తమ సిబ్బందికి, అధికారులకు ఉండాల్సిన ప్రత్యేక హక్కులను గౌరవించాలని తాలిబాన్ ప్రభుత్వాన్ని ఐక్యరాజ్యసమితి కోరింది. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఐక్యరాజ్యసమితి సిబ్బందికి లభించే భద్రతను తాలిబాన్ పాటించాలని మిషన్ డిమాండ్ చేసింది.

కాగా, అఫ్గాన్‌లో తాలిబాన్ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని వేడుకలు జరగనున్నాయి. 2021 ఆగస్టు 15న అమెరికా, నాటో బలగాలు ఆఫ‍్గాన్‌ నుంచి రెండు దశాబ్దాల యుద్ధం తర్వాత వైదొలగడంతో తాలిబాన్ దేశాధికారాన్ని చేజిక్కించుకుంది.

అధికారం చేపట్టిన వెంటనే తాలిబాన్ ప్రభుత్వం బాలికలను మాధ్యమిక పాఠశాలలకు వెళ్లకుండా నిషేధించింది. ఆ తర్వాత ఈ ఆంక్షలను ఉన్నత విద్య, ఉద్యోగాలు, మరిన్ని రంగాలకు విస్తరించింది. దీనితో మహిళలు, బాలికలను బహిరంగ జీవితం నుంచి పూర్తిగా వెలివేశారని అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి.

ఇదే వారంలో మానవ హక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్, తాలిబాన్ నిర్బంధంలో ఉన్న ఐక్యరాజ్యసమితి, స్వచ్ఛంద సంస్థల సిబ్బందిని వెంటనే విడుదల చేయాలని పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆదేశం ప్రకారం, యూఎన్ఏఎంఏ మిషన్ అఫ్గానిస్థాన్‌లో మానవతా సహాయాన్ని ప్రోత్సహించడం, మానవ హక్కులను పరిరక్షించడం, మహిళలు-బాలికల సమానత్వం, సమ్మిళిత పాలన, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలపై పనిచేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement