జద్రాన్ సూపర్‌ సెంచరీ.. అరుదైన రికార్డు | Ibrahim Zadran Becomes Joint Third Fastest Batter In The World To Score 2000 ODI Runs | Sakshi
Sakshi News home page

జద్రాన్ సూపర్‌ సెంచరీ.. అరుదైన రికార్డు

Aug 12 2026 6:08 PM | Updated on Aug 12 2026 6:22 PM

Ibrahim Zadran Becomes Joint Third Fastest Batter In The World To Score 2000 ODI Runs

ఆఫ్ఘనిస్తాన్ యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ వన్డే క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఐర్లాండ్‌తో బెల్‌ఫాస్ట్‌లో జరుగుతున్న నాలుగో వన్డేలో 2,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

ఈ ఫీట్‌తో వన్డేల్లో అత్యంత వేగంగా 2,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ల జాబితాలో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు.

45 ఇన్నింగ్స్‌ల్లోనే 2,000 పరుగులు
24 ఏళ్ల జద్రాన్ తన 45వ వన్డే ఆడుతున్న సమయంలో ఈ మైలురాయిని చేరుకున్నాడు. 2,000 పరుగులు పూర్తి చేయడానికి అతడికి కేవలం రెండు పరుగులు అవసరం కాగా.. కేవలం మూడు బంతుల్లోనే ఆ మార్క్‌ను అందుకున్నాడు. అంతేకాదు.. ఈ మ్యాచ్‌లో జద్రాన్ సెంచరీ కూడా పూర్తి చేశాడు. వన్డేల్లో ఇది అతడికి ఏడవది.

జద్రాన్ కంటే ముందున్నది ఇద్దరే
వన్డేల్లో 2,000 పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన ఆటగాళ్లలో భారత స్టార్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో ఉన్నాడు.

గిల్ కేవలం 38 ఇన్నింగ్స్‌ల్లో 2,000 పరుగులు పూర్తి చేశాడు. దక్షిణాఫ్రికా దిగ్గజం హషీమ్ ఆమ్లా 40 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.

ఇబ్రహీం జద్రాన్ 45 ఇన్నింగ్స్‌ల్లో 2,000 పరుగులు పూర్తి చేసి జహీర్ అబ్బాస్‌, బాబర్‌ ఆజం, కెవిన్‌ పీటర్సన్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్‌ 37 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 232 పరుగులు చేసింది. జద్రాన్‌ (106)తో పాటు సెదిఖుల్లా అటల్‌ (100) కూడా సెంచరీ పూర్తి చేసుకొని ఇన్నింగ్స్‌ కొనసాగిస్తున్నాడు. 

వీరిద్దరు రెండో వికెట్‌కు అజేయమైన 216 పరుగులు జోడించారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, రెండు, మూడు వన్డేల్లో ఆఫ్ఘన్‌ జట్టే గెలుపొందింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement