source: X
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్‌లో మూడు సార్లు ఆరు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి స్పిన్నర్‌గా చరిత్రకెక్కాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 7.4 ఓవర్లలో 34 పరుగులకు 6 వికెట్లు పడగొట్టి ఈ రికార్డు సృష్టించాడు.
రషీద్ 2017లో తొలిసారి ఆరు వికెట్ల ప్రదర్శన (ఐర్లాండ్‌పైనే) నమోదు చేశాడు. అదే ఏడాది విండీస్‌పై 7-18 ప్రదర్శన నమోదు చేసి రెండోసారి ఈ ఘనత సాధించాడు. తాజాగా ఐర్లాండ్‌పై మరోసారి 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి, వన్డే క్రికెట్‌లో మూడోసారి ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఓవరాల్‌గా వన్డేల్లో అత్యధిక సార్లు 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రికార్డు పాక్ స్పీడ్‌స్టర్ వకార్ యూనిస్ పేరిట ఉంది. వకార్ ఏకంగా ఐదుసార్లు 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. స్నిన్ విభాగంలో రషీద్ తర్వాతి స్థానంలో వనిందు హసరంగ (2) ఉన్నాడు.
పేస్ విభాగంలో వకార్ తర్వాతి స్థానంలో ట్రెంట్ బౌల్ట్ (2) ఉన్నాడు. భారత్ తరఫున ఆశిష్ నెహ్రా వన్డేల్లో రెండుసార్లు ఆరు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. రషీద్ ఖాన్ వన్డేల్లో ఇప్పటివరకు ఏడు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు చేశాడు. టెస్ట్‌ల్లో ఐదు సార్లు, టీ20ల్లో రెండు సార్లు ఈ ఘనత సాధించాడు.
ఇదిలా ఉంటే, రషీద్ స్పిన్న్ మాయాజాలం దెబ్బకు రెండో వన్డే ఐర్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు 47 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేయగా.. ఐర్లాండ్ 33.4 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది.
తడి ఔట్ ఫీల్డ్ కారణంగా ఈ మ్యాచ్‌ను తలో 47 ఓవర్లకు కుదించారు. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్‌లోని తొలి వన్డే వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. మూడో వన్డే బెల్‌ఫాస్ట్ వేదికగా ఆగస్ట్ 10న జరుగనుంది.


