source: X
ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య బ్రెడీ వేదికగా ఇవాళ (ఆగస్ట్ 5) జరగాల్సి ఉన్న తొలి వన్డే వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. స్థానిక కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 10:45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో 12:27 గంటల సమయంలో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
ఈ మ్యాచ్ ఐర్లాండ్ కొత్త ప్రధాన కోచ్ గ్యారీ విల్సన్‌కు తొలి మ్యాచ్ కావాల్సింది. 2025 మే తర్వాత ఐర్లాండ్ ఆడుతున్న తొలి 50 ఓవర్ల మ్యాచ్ కూడా ఇదే. వర్షం కారణంగా ఈ రెండు సందర్భాలు వాయిదా పడ్డాయి. జూన్‌లో భారత్‌పై 2-0తో టీ20 సిరీస్ విజయం సాధించిన తర్వాత ఐర్లాండ్ ఆడాల్సిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఇదే.
కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని మిగతా నాలుగు వన్డేలు ఆగస్ట్ 7, 10, 12, 14 తేదీల్లో జరుగనున్నాయి. రెండో వన్డే బ్రెడీలో, ఆఖరి మూడు వన్డేలు బెల్‌ఫాస్ట్‌లో షెడ్యూలయ్యాయి.
క్రికెట్ ఐర్లాండ్ అసంతృప్తి
ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాల నేపథ్యంలో ఆ దేశానికి ఆతిథ్యం ఇవ్వడంపై ఐర్లాండ్ క్రికెట్ అసౌకర్యం వ్యక్తం చేసింది. ఆ దేశ క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సారా కీన్ ఈ విషయమై నైతిక అసౌకర్యం ఉందని గతంలోనే పేర్కొంది. అయినప్పటికీ, నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఐర్లాండ్ ఈ సిరీస్‌కు ఆతిథ్యం ఇస్తోంది.


