నీరజ్‌చోప్రా- మనూ భాకర్ (PC: Instagram)
కామన్‌వెల్త్ గేమ్స్-2026లో 39 పతకాలతో సత్తా చాటిన భారత్.. 2030 ఎడిషన్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా ఎంపీ దీపేందర్ సింగ్ హుడా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
‘‘హర్యానా అత్యధికంగా దేశానికి పతకాలు తెస్తుంటే.. క్రీడల నిర్వహణ మాత్రం గుజరాత్‌కు దక్కింది. గత 15- 20 ఏళ్ల నుంచి భారత్ సాధించిన పతకాల్లో హర్యానా వాటా యాభై శాతం కంటే తక్కువేమీ కాదు. ఈ దేశంలో క్రీడాభివృద్ధి కోసం ఎక్కడైన అత్యధికంగా నిధులు వినియోగించాలంటే అందుకు హర్యానాకు మాత్రమే అర్హత ఉంది.
ఇక్కడి క్రీడాకారులు దేశాన్ని తలెత్తుకునేలా చేశారు. గుజరాత్ నుంచి ఒక్క అథ్లెట్ కూడా పతకం సాధించకపోయినా ఆతిథ్య హక్కులు వారికి ఎలా లభిస్తాయి?’’ అని కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరి ఈ ఎంపీ అన్నట్లుగా నిజంగానే భారత్ ఆసియా క్రీడలు, కామన్‌వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్‌లో గెలిచిన మెడల్స్‌లో హర్యానాకే మెజారిటీ వాటా ఉందా?! అంటే అవుననే చెప్పవచ్చు. అందుకు ఈ గణాంకాలే నిదర్శనం.
కామన్‌వెల్త్ గేమ్స్-2026లో భారత్ 39 పతకాలు గెలవగా.. అందులో హర్యానా అథ్లెట్లవే పది పతకాలు. హర్యానాకు చెందిన షర్మిలా ధన్కర్, బాక్సర్లు ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఘంఘాస్, సచిన్ సివాచ్, అంకుశ్ పంఘాల్, నీరజ్ చోప్రా, నరేందర్ బేర్వాల్, సీమా కలీరమ్నా పతకాలు సాధించారు.
2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లోనూ హవా
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో హర్యానా అథ్లెట్లు అదరగొట్టారు. షూటర్ మనూ భాకర్ రెండు కాంస్యాలతో సత్తా చాటగా.. ‘గోల్డెన్ బాయ్’ నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో రజతం అందించాడు. మనూ భాకర్ షూటింగ్ విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగం, సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కాంస్యం అందుకుంది.
పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల రెజ్లింగ్ విభాగంలో అమన్ సెహ్రావత్ కాంస్యం గెలవగా.. హాకీ జట్టులో భాగమైన అభిషేక్ నైన్ కాంస్యాన్ని ముద్దాడాడు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్యం గెలిచాడు.
2023 ఆసియా క్రీడల్లో ఇలా
ఆసియా క్రీడలు-2023లో భారత్ మొత్తంగా 106 పతకాలు గెలవగా.. ఇందులో 38 టీమ్ మెడల్స్. మిగిలిన 68 పతకాల్లో హర్యానా అథ్లెట్లవే 16. నీరజ్ చోప్రా, అన్నూ రాణి (జావెలిన్ త్రో), పారుల్ చౌదరి (5000 మీటర్ల పరుగు), పాలక్ గులియా (షూటింగ్ వ్యక్తిగతం, టీమ్) స్వర్ణాలు సాధించారు.
మిగిలిన హర్యానా అథ్లెట్లలో రమితా జిందాల్ (షూటింగ్), అదితి గోపీచంద్ స్వామి (ఆర్చరీ) రజతాలు గెలవగా.. సీమా పునియా (డిస్కస్ త్రో), బాక్సర్లు ప్రీతి పవార్, నరేందర్ బేర్వాల్, ప్రవీణ్ హుడా, అథ్లెటిక్స్‌లో ప్రీతి లంబా, రెజ్లింగ్‌లో అంతిమ్ పంఘాల్, కిరణ్, అమన్ సెహ్రావత్, సునిల్ కుమార్ కాంస్యాలు గెలుచుకున్నారు.
కామన్‌వెల్త్ గేమ్స్-2022లో
ఇదిలా ఉంటే.. బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ గేమ్స్-2022లో హర్యానా 15 వ్యక్తిగత పతకాలతో పాటు.. ఆరు టీమ్ మెడల్స్ సొంతం చేసుకుంది. వ్యక్తిగత విభాగంలో అథ్లెట్లకు ఎనిమిది స్వర్ణాలు వచ్చాయి.
ఏకంగా స్వర్ణ పతకం
ఇక టోక్యో ఒలింపిక్స్-2021లో నీరజ్ చోప్రా ఏకంగా భారత్‌కు స్వర్ణ పతకం అందించిన సంగతి తెలిసిందే. అదే విధంగా హర్యానాకే చెందిన రెజ్లర్లు రవి కుమార్ దహియా రజతం, బజరంగ్ పునియా కాంస్యం గెలిచారు.
ఆసియా క్రీడలు-2018లో భారత్ మొత్తంగా 70 పతకాలు గెలవగా.. ఇందులో హర్యానా అథ్లెట్లు 17 సొంతం చేసుకున్నారు. బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్, నీరజ్ చోప్రా, మంజీత్ సింగ్, అమిత్ పంఘాల్ స్వర్ణాలు దక్కించుకున్నారు. దీనిని బట్టి హర్యానా క్రీడల్లో ఎంతటి విజయవంతమైన రాష్ట్రమో అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ప్రతీ ప్రతిష్టాత్మక ఈవెంట్లోనూ హర్యానా నుంచే భారత్‌కు ఎక్కువ పతకాలు లభించాయి.


