8 వికెట్లతో ఆసీస్‌ బౌలర్‌ విజృంభణ | Meet Campbell Thompson, Australia Prodigy Who Rattled Bangladesh With His 8 for 25 | Sakshi
Sakshi News home page

8 వికెట్లతో ఆసీస్‌ బౌలర్‌ విజృంభణ

Aug 8 2026 4:12 PM | Updated on Aug 8 2026 4:29 PM

Meet Campbell Thompson, Australia Prodigy Who Rattled Bangladesh With His 8 for 25

source: X

రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం 23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై కాలుమోపిన బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే ఘోర పరాభవం ఎదురైంది. టెస్ట్‌ సిరీస్‌కు ముందు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎలెవెన్‌తో జరిగిన మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో ఆ జట్టు ఇన్నింగ్స్‌ 38 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. 

తొలి ఇన్నింగ్స్‌లో మెహిది హసన్‌ మిరాజ్‌ అజేయ సెంచరీతో (109) ఆదుకోవడంతో ఓ మోస్తరు స్కోర్‌ (263) చేసిన బంగ్లా జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ యువ సంచలన పేసర్‌ క్యాంప్‌బెల్‌ థాంప్సన్‌ (11-2-25-8) ధాటికి 54 పరుగులకే కుప్పకూలింది. 

మధ్యలో టేగ్‌ విల్లీ (130) శతక్కొట్టడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎలెవెన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 355 పరుగులు చేసింది. థాంప్సన్‌ వీర విజృంభణ దెబ్బకు ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. ఆసీస్‌తో రెగ్యులర్‌ టెస్ట్‌ సిరీస్‌ ఆగస్ట్‌ 13 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్‌ డార్విన్‌ వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్‌ ఆగస్ట్‌ 22 నుంచి మెక్‌కేలో ప్రారంభం కానుంది.

తాజా సంచలన ప్రదర్శన తర్వాత క్యాంప్‌బెల్‌ థాంప్సన్‌ క్రికెట్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారాడు. ఈ 22 ఏళ్ల ఎడమచేతి వాటం పేసర్‌ ఎవరా అని ఆరా తీయడం ప్రారంభించారు.

ఎవరీ క్యాంప్‌బెల్‌ థాంప్సన్‌..?
దక్షిణ ఆస్ట్రేలియాలోని మౌంట్‌ బార్కర్‌కు చెందిన థాంప్సన్‌ 2023లో క్లబ్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2025 ఆగస్టులో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ అకాడమీలో చోటు సంపాదించాడు. అక్కడ ఐదు మ్యాచ్‌లు ఆడిన తర్వాత 2025 నవంబర్‌లో ఇంగ్లాండ్‌ XIతో జరిగిన మ్యాచ్‌లో ప్రైమ్‌ మినిస్టర్స్‌ XI తరఫున అరంగేట్రం చేశాడు.

2025-26 షెఫీల్డ్‌ షీల్డ్‌ సీజన్‌లో సౌత్‌ ఆస్ట్రేలియా తరఫున ఫస్ట్‌క్లాస్‌ అరంగేట్రం చేశాడు. క్వీన్స్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.

అయితే బంగ్లాదేశ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ అతడి కెరీర్‌లోనే అతిపెద్ద బ్రేక్‌థ్రూ. రెండో ఇన్నింగ్స్‌లో 8/25తో చెలరేగి ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.

స్టార్క్‌కు వారసుడవుతాడా..?
వేగంగా బంతులు వేయడంతో పాటు కొత్త బంతితో స్వింగ్‌ చేయగల సామర్థ్యం థాంప్సన్‌కు అతిపెద్ద బలం. ఇదే అతడిని ఆస్ట్రేలియా భవిష్యత్‌ పేస్‌ దళంలో కీలక ఆటగాడిగా మార్చే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ కెరీర్‌ చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో.. అతడి స్థానాన్ని భర్తీ చేసే యువ పేసర్లను ఆస్ట్రేలియా వెతుకుతోంది. ఈ క్రమంలో థాంప్సన్‌ పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది.

ప్రస్తుతం అతడి ఫస్ట్‌క్లాస్‌ అనుభవం చాలా తక్కువే. కానీ బంగ్లాదేశ్‌పై  చేసిన ప్రదర్శన మాత్రం అతడి సామర్థ్యాన్ని చాటింది. ఇదే స్థాయిలో రాణిస్తే.. త్వరలోనే ఆస్ట్రేలియా జాతీయ జట్టులోకి థాంప్సన్‌కు పిలుపు రావడం ఆశ్చర్యం కలిగించకపోవచ్చు.

భవిష్యత్తులో భారత్‌తో జరిగే బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలోనైనా.. అంతకంటే ముందే అయినా.. ఈ యువ ఎడమచేతి పేసర్‌కు అవకాశం దక్కుతుందేమో చూడాలి. థాంప్సన్‌కు బ్యాటింగ్‌లోనూ మంచి సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తోంది. అతడి ప్రొఫైల్‌ ప్రకారం అతడు కుడి చేతి వాటం బ్యాటర్‌. అతన్ని బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా పరిగణిస్తారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement