source: X
బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి దేశానికి వస్తానని ప్రకటించిన కొన్ని గంటల్లోనే (ఆగస్ట్ 5) ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పూర్వీకుల ఇంటిపై (మగురా పట్టణం) దాడి జరిగింది. దుండగులు పెట్రోల్ బాంబులు విసరడంతో పాటు ఇంటి కిటికీలను ధ్వంసం చేశారు. పై అంతస్తులో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.
షేక్ హసీనా కార్యక్రమంలో షకీబ్ పాల్గొనడంతోనేనా..?
ఈ దాడికి కొన్ని గంటల ముందు షకీబ్ అల్ హసన్ ఓ వర్చువల్ మీడియా కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో షేక్ హసీనా కూడా ప్రసంగించారు. 2024లో అధికారాన్ని కోల్పోయి భారత్‌లో ఉంటున్న హసీనా.. డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని స్పష్టం చేశారు.
“నేను నా ప్రజల వద్దకు తిరిగి వస్తాను. నన్ను జైలులో పెట్టినా, చంపినా తిరిగి వెళ్లాల్సిందే” అని హసీనా పేర్కొన్నట్లు సమాచారం.
హసీనా ప్రభుత్వాన్ని 2024లో జరిగిన విద్యార్థి ఉద్యమం కూలదోసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె భారత్‌కు వచ్చారు. ప్రస్తుతం ఆమెపై బంగ్లాదేశ్‌లో పలు కేసులు ఉన్నాయి. గతేడాది ఆమెకు మరణశిక్ష కూడా విధించారు. అయితే, తనపై ఆరోపణలను హసీనా రాజకీయ ప్రేరేపితమైనవిగా కొట్టిపారేశారు.
షకీబ్‌పైనా పలు కేసులు
షకీబ్ అల్ హసన్ కూడా అవామీ లీగ్ తరఫున 2024లో పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అయితే హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత ఆయన బంగ్లాదేశ్‌కు దూరంగా ఉంటున్నారు. షకీబ్‌పై హత్య, అవినీతి, మోసం, మనీలాండరింగ్ తదితర ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుల్లో దర్యాప్తులు కొనసాగుతున్నాయి.
భారత్‌పై బంగ్లాదేశ్ అసంతృప్తి
షేక్ హసీనా న్యూఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడటంపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె మీడియా కార్యక్రమంలో పాల్గొనడం తమ దేశ సార్వభౌమత్వానికి అవమానకరమని పేర్కొంది. ఈ పరిణామం భారత్-బంగ్లాదేశ్ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది.
ఇదిలా ఉండగా, హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని ఢాకా ఇప్పటికే భారత్‌ను కోరింది. ఈ అభ్యర్థనను భారత ప్రభుత్వం న్యాయపరమైన విధానాల ప్రకారం పరిశీలిస్తోంది.


