నా ప్రజలకు దూరంగా ఉండలేను: మాజీ ప్రధాని షేక్ హసీనా
న్యూఢిల్లీ: జైలు శిక్ష లేదా మరణ శిక్షకు తాను భయపడబోనని బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, అవామీ లీగ్ నేత షేక్ హసీనా తేల్చిచెప్పారు. బంగ్లాదేశ్‌ను సరైన మార్గంలో నడిపించడమే ధ్యేయంగా ఈ ఏడాది డిసెంబరులో స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బుధవారం ఆమె ఆడియో ఆధారిత వర్చువల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారు షేక్ హసీనాను చూడలేకపోయారు.
కేవలం ఆమె గొంతును మాత్రమే వినగలిగారు. భారీ నిరసనల నేపథ్యంలో 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు చేరుకున్న తర్వాత ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడడం ఇదే మొదటిసారి. ‘‘నాకు తెలుసు.. వాళ్లు(బంగ్లాదేశ్ ప్రభుత్వం) నన్ను జైల్లో పెట్టొచ్చు లేదా చంపేయొచ్చు. అయినా సరే నా వాళ్లతో ఉండటానికి నేను ఇంటికి తిరిగి వెళ్తాను’’అని షేక్ హసీనా స్పష్టంచేశారు. భారతదేశాన్ని బంగ్లాదేశ్‌కు గొప్ప మిత్రదేశంగా అభివరి్ణంచారు.
కష్టకాలంలో భారత్ ఎల్లప్పుడూ తమ దేశానికి అండగా నిలిచిందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి షేక్ హసీనా ప్రస్తావించారు. తాను స్వదేశానికి తిరిగి వెళ్లడం అధికారం కోసం కాదని, బంగ్లాదేశ్‌ను తిరిగి అభివృద్ధి, లౌకికవాదం, సంక్షేమం వైపు నడిపించేందుకేనని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే తన సొంత ప్రజల మధ్య ఉండటానికి తిరిగి వెళ్తానని వివరించారు. తన ప్రియమైన దేశ ప్రజలు బాధపడుతుండగా వారికి దూరంగా ఉండలేనని వ్యాఖ్యానించారు.
తనను నిర్బంధించినా, జైలుకు పంపించినా, తప్పుడు కేసుల్లో ఇరికించినా వెనక్కి తగ్గబోనని అన్నారు. ప్రజల పట్ల కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా అడ్డుకొనే శక్తి భయానికి లేదని ఉద్ఘాటించారు. స్వదేశంలో అడుగుపెట్టిన తర్వాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) ప్రభుత్వంతో ఎటువంటి అనధికారిక చర్చలు జరిపే అవకాశం లేదని కొట్టిపారేశారు. అవామీ లీగ్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో గుర్తుతెలియని ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారు.


