రాత్రంతా రష్యా క్షిపణులు, డ్రోన్ల దాడి
21 మంది దుర్మరణం
నిలువరించే ఆయుధాలు నిండుకోవడంతో నష్టం: జెలెన్‌స్కీ
కీవ్: గగనతల రక్షణ వ్యవస్థలు బలహీనంగా ఉన్న సమయంలో శత్రుదేశం నుంచి క్షిపణులు విరుచుకుపడితే విధ్వంసం ఏస్థాయిలో ఉంటుందో ఉక్రెయిన్‌కు రష్యా రుచిచూపించింది. మంగళవారం రాత్రి నుంచి పెద్ద సంఖ్యలో బాలిస్టిక్ మిస్సైళ్లు, యాంటీ–షిప్ మిస్సైళ్లు, డ్రోన్లతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా సమీప ప్రాంతాలపై రష్యా విరుచుకుపడింది. ఈ దాడుల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
జనావాసాలు, రైల్వేస్టేషన్, ఇ–కామర్స్ సంస్థ, రిటైల్ సంస్థల గిడ్డంగులపై దాడులు జరగడంతో అందులోని కొందరు సిబ్బంది సైతం చనిపోయారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నారని, మరణాల సంఖ్య పెరిగే ఆస్కారముందని ఉక్రెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. దాడుల్లో 44 మంది గాయాలపాలయ్యారని కీవ్ రీజియన్ సైనిక విభాగ సారథి తైమూర్ టకచెంకో తెలిపారు. ఈ దాడుల పాపం పరోక్షంగా యూరప్ మిత్రదేశాలదేనని ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
సమయానికి ఇంటర్‌సెప్టార్ మిస్సైళ్ల వంటి గగనతల రక్షణ వ్యవస్థలను అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ స్థాయిలో ప్రాణనష్టం జరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అసహనం వ్యక్తంచేశారు. శత్రుదేశ క్షిపణులను గాల్లోనే అడ్డగించే పేట్రియాట్ క్షిపణుల తయారీ సాంకేతికతను ఉక్రెయిన్‌కు ఇస్తామని హామీ ఇచ్చి తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట మార్చిన కొద్దిరోజులకే ఉక్రెయిన్‌పై ఇలా క్షిపణుల వాన కురవడం గమనార్హం. 24 బాలిస్టిక్ క్షిపణులు, మరో నాలుగు హైపర్‌సోనిక్ జిర్కోన్/సూపర్‌సోనిక్ ఓనిక్ క్రూజ్ క్షిపణులు, 115 డ్రోన్లను రష్యా ప్రయోగించింది.
రష్యా డ్రోన్ల సంస్థ చీఫ్‌కు తీవ్రగాయాలు
రష్యన్ కామకాజీ(ఆత్మాహుతి) డ్రోన్లుగా పేరుగాంచిన ఉపియర్ డ్రోన్లను తయారుచేసే ఉరాల్‌డ్రోన్ ప్లాంట్ సీఈఓ వ్లాదిమిర్ టకచుక్ కారు పేలుడులో తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం స్వెర్డ్‌లోవోస్క్ రీజియన్‌లోని సంస్థ తయారీ కర్మాగారం వద్ద కారు పేలుడు సంభవించింది. దీంతో అందులోని వ్లాదిమిర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కారు పేలుడుకు కారకులెవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.


