న్యూఢిల్లీ: లోక్‌సభ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ, మహిళా రిజర్వేషన్ బిల్లుల కోసం ఆగస్ట్ 16నుంచి 18వ తేదీ వరకు పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశ పరచబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు బుధవారం రాత్రి స్పష్టంచేశారు. ‘‘స్వాతంత్య్రదినోత్సవ వేడుకల తర్వాత ప్రత్యేక సెషన్ ఏర్పాటుచేయబోతున్నట్లు వార్తలొచ్చాయి.
కానీ అలాంటి ప్రతిపాదన ఏదీ లేదు’’అని రిజిజు చెప్పారు. 2029లో లోక్‌సభతోపాటు శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌తోపాటు లోక్‌సభ నియోజకవర్గాలను 816కు పెంచే ప్రతిపాదనలతో రూపొందించిన బిల్లులను ఆమోదింపజేసేందుకు ప్రయత్నించి గతంలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం భంగపడిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా బిల్లును ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్న వార్తల నడుమ రిజిజు భిన్నంగా స్పందించారు.


