సభకు సహకరించండి | Kiren Rijiju and Rahul Gandhi meet to resolve Parliament sessions | Sakshi
Sakshi News home page

సభకు సహకరించండి

Aug 6 2026 5:19 AM | Updated on Aug 6 2026 5:19 AM

Kiren Rijiju and Rahul Gandhi meet to resolve Parliament sessions

రాహుల్‌ గాందీకి కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు విజ్ఞప్తి  

విద్యార్థులపై హింస, విరాళాల చోరీపై చర్చించాలని రాహుల్‌ షరతు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రతిరోజూ కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్వయంగా రంగంలోకి దిగారు. బుధవారం ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో పార్లమెంట్‌లోని ఆయన చాంబర్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేలా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నియోజకవర్గాల పునర్వీభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ల బిల్లుపైనా రాహుల్‌ గాం«దీతో రిజిజు చర్చించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. 

ఈ బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, ఆమోదించేందుకు సహకరించాలని రిజిజు కోరగా, రాహుల్‌ గాంధీ ఎలాంటి హామీ ఇవ్వలేదని పేర్కొన్నాయి. రాహుల్, రిజిజు భేటీ దాదాపు 50 నిమిషాలపాటు జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్‌ సభ్యులు గౌరవ్‌ గొగోయ్, కేసీ వేణుగోపాల్‌ కూడా ఆ తర్వాత ఈ సమావేశంలో చేరారు. 

వర్షాకాల సమావేశాలను పొడిగించడం లేదా ప్రత్యేక సమావేశం నిర్వహించడంపై రిజిజు ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదని కాంగ్రెస్‌ వర్గాలు చెప్పాయి. అయితే, నియోజకవర్గాల పునర్వీభజన అంశంపై ప్రతిపక్షం వైఖరి గురించి రాహుల్‌ అభిప్రాయాలను రిజిజు అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నాయి. 

పేపర్‌ లీక్‌ వ్యవహారంపై నిరసన తెలియజేసిన విద్యార్థులపై జరిగిన హింస గురించి హోంమంత్రి అమిత్‌ షా ప్రకటన చేయడం, అయోధ్యలోని రామాలయ విరాళాల చోరీపై చర్చ జరగడం అనేవి పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగడానికి అత్యవసరమైన షరతులు అని రిజిజుకు రాహుల్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. గత పది రోజుల వ్యవధిలో వారిద్దరూ ప్రత్యేకంగా సమావేశం కావడం ఇది రెండోసారి. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగియనున్నాయి. విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు–2026ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రసంగిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement