ఎక్కడి బంగ్లాదేశ్‌? ఎక్కడి ఆదిలాబాద్‌? | Adilabad police arrest two Bangladeshis | Sakshi
Sakshi News home page

ఎక్కడి బంగ్లాదేశ్‌? ఎక్కడి ఆదిలాబాద్‌?

Aug 5 2026 4:58 AM | Updated on Aug 5 2026 4:58 AM

Adilabad police arrest two Bangladeshis

చోరీ కేసులో ఆదిలాబాద్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తు, ఫోన్లు (ఫైల్‌)

సులభంగా భారత్‌లోకి చొరబడుతూ చోరీలు

ఇద్దరు బంగ్లాదేశీయులను అరెస్టు చేసిన ఆదిలాబాద్‌ పోలీసులు

ప్రధాన నిందితుడి విచారణలో విస్తుపోయే నిజాలు

కొన్నేళ్లుగా సుమారు 10–12సార్లు వచ్చి పలు రాష్ట్రాల్లో దొంగతనాలు

ఇదే తరహాలో దొంగతనాలకు పాల్పడుతున్న మరో 15 మంది

సహకరించినవారు, నకిలీ పత్రాలు సమకూర్చిన వారిపై ఆరా

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌లో జరిగిన దొంగతనం కేసులో పట్టుబడిన ప్రధాన నిందితుడు మహ్మద్‌ జౌని అలీ గత కొన్నేళ్లుగా సుమారు 10 నుంచి 12 సార్లు అక్రమంగా, చాలా సులభంగా బంగ్లాదేశ్‌ నుంచి భారతదేశంలోకి చొరబడ్డాడు. వివిధ రాష్ట్రాల్లోని ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. ఇదే తరహాలో పనిచేసే 12 నుంచి 15 మంది బంగ్లాదేశ్‌ వాసులతో కూడిన ముఠాతో అతడికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఆదిలాబాద్‌ జిల్లా మావల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ చోరీ కేసులో జిల్లా పోలీసులు ఇద్దరు బంగ్లాదేశీవాసులతోపాటు ఒక భారతీయ నిందితుడిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. 

సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ వివరాలను వెల్లడించిన విషయం విదితమే. సుమారు తొమ్మిదేళ్లుగా దేశ వ్యాప్తంగా పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు మహ్మద్‌ జౌని అలీని విచారించగా, పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజస్తాన్, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో సంచరిస్తూ ఇళ్ల తాళాలు పగులగొట్టి విలువైన వస్తువులు, బంగారం, వాహనాలు చోరీలకు పాల్పడుతున్నారు. 

నిందితులు పగటిపూట కుక్కర్లు, గ్రైండర్లు విక్రయిస్తున్నట్లు నటిస్తూ కాలనీల్లో సంచరిస్తారు. ఇళ్లను రెక్కీ నిర్వహించి తాళాలు వేసి ఉన్న వాటిని గుర్తిస్తారు. రాత్రివేళల్లో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతారు. జౌనిపై దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎనిమిదికిపైగా నేరాల కేసులు ఉన్నాయి. ఇదే కేసులో పట్టుబడ్డ మరో సహ నిందితుడు భారత్‌కు చెందిన తరుణ్‌ సింగ్‌పై ఆరుకుపైగా కేసులు నమోదై ఉన్నాయి. ముఠాలోని ఇతర సభ్యులపై కూడా వివిధ రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైనట్లు గుర్తించారు.

సహకరించిన వ్యక్తుల పాత్రపై దర్యాప్తు..
సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, నిఘా సమాచారం, వివిధ రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో ఆదిలాబాద్‌ జిల్లా పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్‌ చేసి కేసును ఛేదించారు. మరింత లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ముఠాకు చెందిన ఇతర సభ్యులు, సహచరులు, అక్రమంగా భారతదేశంలో నివసించేందుకు సహకరించిన వ్యక్తులు, నకిలీ పత్రాలు సమకూర్చిన వారి పాత్రపై సంబంధిత రాష్ట్ర పోలీసులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా పోలీసులు ముందుకెళ్తున్నారు. దేశ భద్రతకు ముప్పుగా మారే అక్రమ విదేశీయులు, అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర నేర ముఠాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. 

ఐబీకి వివరాలు పంపిస్తున్నాం
ఈ దొంగతనం కేసులో మరికొంత మంది బంగ్లాదేశ్‌ వాసులు ముఠాగా సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ప్రధాన నిందితుడి ద్వారా తెలిసింది. ఆ మిగిలిన వారి కోసం ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ)కి వివరాలు పంపిస్తున్నాం. అక్రమంగా దేశంలోకి ఎలా ప్రవేశిస్తున్నారు? ఇంకా ఎలాంటి నేరాలు చేస్తున్నారు? అనే విషయాలను రాబడుతున్నాం. వివిధ రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటున్నాం. – అఖిల్‌ మహాజన్, ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement