కృష్ణమ్మ.. కరువు తీరా కదులుతోంది | Srisailam project to be completed in next five to six days | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ.. కరువు తీరా కదులుతోంది

Aug 5 2026 4:51 AM | Updated on Aug 5 2026 4:51 AM

Srisailam project to be completed in next five to six days

ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు పోటెత్తుతున్న వరద  

జూరాలకు 2.41 లక్షల  క్యూసెక్కుల ప్రవాహం 

మరో ఐదారు రోజుల్లో నిండనున్న శ్రీశైలం ప్రాజెక్టు

సాక్షి, హైదరాబాద్‌/గద్వాల/అచ్చంపేట: కృష్ణమ్మ..కరువు తీరా కదులుతోంది. ఆల్మట్టి నుంచి శ్రీశైలం జలాశయం వరకు ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలం జలాశయంలో మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 1,91,076 క్యూసెక్కుల వరద చేరుతుండడంతో జలాశయ గరిష్ట నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకుగాను 106.41 టీఎంసీలకు నిల్వలు చేరాయి. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు 2.41 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 30 గేట్లు ఎత్తి 2.53 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. 

రోజుకు సగటున 20 టీఎంసీల నీళ్లు రావడంతో మరో ఐదారు రోజుల్లో జలాశయం నిండనుందని అంచనా వేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే అవకాశముంది. శ్రీశైలం జలాశయ గరిష్ట నిల్వమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 860 అడుగులకు నీటినిల్వలు చేరాయి. కృష్ణా ప్రధాన పాయపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి జలాశయానికి 1.5 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తగా, వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో నారాయణపూర్‌ జలాశయానికి 1.5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండడంతో 1.45 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 

మహారాష్ట్రలో ఉపనది భీమాపై ఉన్న ఉజ్జయినీ జలాశయానికి 68,897 క్యూసెక్కుల వరద వస్తుండగా, 75,626 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఇక ఉపనది తుంగభద్రపై కర్ణాటకలో ఉన్న తుంగభద్ర జలాశయానికి సైతం వరద ఉధృతి పెరుగుతోంది. జలాశయానికి 82,087 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 105.79 టీఎంసీల గరిష్ట సామర్థ్యానికి గానూ 51.15 టీఎంసీలకు నిల్వలు చేరాయి. వరద ఇలానే కొనసాగితే మరో వారం రోజుల్లో తుంగభద్ర జలాశయం సైతం నిండి శ్రీశైలం వైపు తుంగభద్ర జలాలు పరుగులు తీయనున్నాయి. సాధారణంగా ఆగస్టులోనే కృష్ణానదికి అధిక వరద వస్తుందని నీటిపారుదల శాఖ అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కృష్ణమ్మ ఆశలు రేకెత్తిస్తోంది. 

మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు కృష్ణా బేసిన్‌లో ప్రధాన ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు, నీటి నిల్వలు ఇలా..:

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement