ఈ మసాలాతో మటాషే | 25 tons of adulterated spices and 89 tons of raw materials seized | Sakshi
Sakshi News home page

ఈ మసాలాతో మటాషే

Aug 5 2026 4:43 AM | Updated on Aug 5 2026 4:43 AM

25 tons of adulterated spices and 89 tons of raw materials seized

పట్టుకున్న కల్తీ మసాలా దినుసులతో సీపీ సజ్జనర్, సంయుక్త సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ తదితరులు

వ్యవస్థీకృతంగా ఆహార దినుసుల కల్తీ.. 

ఇండోర్‌లో నేర్చుకుని నగరంలో దందా

25 టన్నుల కల్తీ మసాలాలు,  89 టన్నుల ముడి సరుకులు సీజ్‌  

తొలిసారిగా బీఎన్‌ఎస్‌ చట్టం ప్రయోగం  

నిందితులపై పీడీ యాక్ట్‌: సజ్జనర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: నగర శివార్లలోని కాటేదాన్, బాలాపూర్‌ కేంద్రంగా సాగుతున్న ఆహార కల్తీ దందాకు హైదరాబాద్‌ ఫుడ్‌ అడాల్ట్రేషన్‌ సర్వైలెన్స్‌ టీమ్‌ (హెచ్‌–ఫాస్ట్‌) చెక్‌ చెప్పింది. మొత్తం 13 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన అధికారులు మూడు సంస్థల్లో కల్తీ మసాలా దినుసులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వీటి యజమానుల్ని అరెస్టు చేసిన అధికారులు 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.1 టన్నుల ముడి సరుకును స్వాదీనం చేసుకున్నారు. 

నిందితులపై తొలిసారిగా బీఎన్‌ఎస్‌లోని 110 సెక్షన్‌ (ఎదుటి వారికి ప్రాణహాని కలిగే అవకాశం ఉందని తెలిసీ కల్తీ చేయడం) కింద కేసు నమోదు చేశామని, పీడీ యాక్ట్‌ కూడా ప్రయోగిస్తున్నామని సీపీ సజ్జనర్‌ చెప్పారు. ఆహార కల్తీపై 100 లేదా 87126 61212లకు సమాచారం అందించాలని కోరారు. సంయుక్త సీపీ తఫ్ఫీర్‌ ఇక్బాల్, డీసీపీ వైభవ్‌ రఘునాథ్‌ గైక్వాడ్‌లతో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసుల దర్యాప్తు కోసం సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.  

వ్రస్తాలకు వేసే రంగులతో ఆవాలు..  
కాటేదాన్, బాలాపూర్‌ల్లో మహాలక్ష్మి ఇండస్ట్రీస్, ప్రకాష్‌ ఇంపెక్ట్స్‌లతో పాటు ఇలా పేరు లేకుండా నడుస్తున్న సంస్థలకు సరైన లైసెన్సులు కూడా లేవు. వీటి యజమానులు రాహుల్‌ భట్టి, విశాల్‌ పన్వార్, దులాచాంద్‌ కచ్చావర్‌ ఆహార కల్తీ ఎలా చేయాలనేది ఇండోర్‌లో నేర్చుకున్నారు. నగరానికి వచ్చి ఈ సంస్థల్ని ఏర్పాటు చేశారు. వీళ్లు నాసిరకమైన ఆవాలను నల్లగా నిగనిగలాడేలా చేయడానికి అత్యంత ప్రమాదకరమైన విధానం అవలంబిస్తున్నారు.

 ఓ మిక్సర్‌లో 200 కేజీల ఆవాలు, నల్లటి క్లాత్‌ డై 200 గ్రాములు (వస్త్రాలకు వేసే రంగు) 5 లీటర్ల నీటిలో కలిపి వేస్తున్నారు. ఆవాలు మెరుస్తూ ఆకర్షణీయంగా ఉండటానికి టాల్కమ్‌ పౌడర్, రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ కూడా కలుపుతున్నారు. సాధారణంగా కల్తీ మసాలా దినుసుల్ని నీళ్లల్లో వస్తే వాటి రంగు నీటిలో కలుస్తుంది. ఈ ఫ్యాబ్రిక్‌ డై వాడితే అలా జరగదు. ఇది కలిసి ఆహారపదార్థాలు తింటే మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్, కేన్సర్, గ్యా్రస్టిక్‌ సమస్యలు వస్తాయి. ఫ్యాబ్రిక్‌ డై అనేది విషపూరితమైన తినకూడదని రసాయనం. 

సగం ధరకే విక్రయిస్తుండటంతో..
ముగ్గురు నిందితులు ఆవాలతో పాటు వాము, జీలకర్ర, లవంగా లు, సాజీరా, సోంపు తదితరాలను కూడా కల్తీ చేస్తున్నారు. ఆయిల్‌ తీసేసిన లవంగాలను తాజాగా కనిపించే చేయడానికి సింథటిక్‌ కలర్స్‌ వాడుతున్నారు. దీంతో పాటు ఫుడ్‌ కలర్స్‌ను పరిమితికి మించి, ఇండ్రస్టియల్‌ గ్రేడ్‌ పర్మనెంట్‌ కలర్స్‌ను వాడి నాసిరకం సరుకును తాజాగా మార్చి ప్యాక్‌ చేసి విక్రయిస్తున్నారు. 

ఈ ఉత్పత్తులు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనేక దుకాణాలకు సరఫరా అవుతున్నాయి. ఆయా వస్తువుల మార్కెట్‌ రేటులో సగం ధరకే వీటిని అమ్ముతూ అమాయకులైన వినియోగదారులను మో సం చేస్తున్నారు. ఈ కల్తీ దందాపై సమాచారం అందుకున్న హెచ్‌–ఫాస్ట్‌ ఇన్‌స్పెక్టర్లు రంజిత్‌ గౌడ్, అంజయ్య నేతృత్వంలో ఎస్సైలు శంకర్, కృష్ణ, అఖిల్‌ తమ బృందాలతో దాడి చేసి పట్టుకున్నారు.    

సీపీ సజ్జనర్‌ చేతుల్లోని ఈ గ్లాసులు చూశారా.. ఒకటి రంగు నీళ్లతో ఉండగా.. మరొకటి సాధారణ నీటితో కనిపిస్తోంది. విషయమేమిటంటే.. కల్తీ లవంగాలున్న నీళ్ల గ్లాసు రంగులోకి మారగా.. మామూలు లవంగాలు ఉంచిన గ్లాసులోని నీళ్లు మాత్రం స్వచ్ఛంగా ఉన్నాయి. కల్తీ మసాలా దినుసులు పట్టుబడిన సందర్భంగా కల్తీ లవంగాలకు, స్వచ్ఛమైన లవంగాలకు ఇలా తేడా ఉంటుందని సీపీ చూపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement