నెలవారీ పాస్‌లపై హెచ్‌ఎంఆర్‌ఎల్ కసరత్తు
విధివిధానాలపై త్వరలో ఆర్టీసీతో సంప్రదింపులు.. మెట్రోలో ప్రస్తుతం రోజుకు 4.7 లక్షల మంది ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ తరహాలో మెట్రో రైళ్లలోనూ నెలవారీ, మూడు నెలల పాస్‌లను ప్రవేశపెట్టేందుకు హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ సిద్ధమవుతోంది. ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడానికి సదుపాయాలను మరింత మెరుగుపరుచుకోవాలని.. ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెట్టాలని ఇటీవల జరిగిన సంస్థ పాలకమండలి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. విద్యార్ధులు, ఉద్యోగుల ప్రయోజనాలకు అనుగుణంగా పాస్‌లను ప్రవేశపెట్టాలని సూచించారు. దీంతో ఆర్టీసీ అధికారులతో త్వరలో సంప్రదింపులు జరపనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఆర్టీసీలో ఉన్న వివిధ పాస్‌లు, వాటి ధరలు, ప్రయాణికుల ఆదరణ వంటి అంశాలను పరిశీలించి మెట్రో రైళ్లలో పాస్‌లను ప్రవేశపెట్టేందుకు విధివిధానాలను సిద్ధం చేయనున్నారు. ఇప్పటివరకు కొన్ని రకాల రాయితీ టికెట్లను ఎల్ అండ్ టీ మెట్రో రైల్ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికుల నుంచి వాటికి ఆదరణ కూడా లభించింది. కానీ అప్పట్లో వరుస నష్టాలను దృష్టిలో ఉంచుకొని రాయితీలను విరమించారు. ప్రస్తుతం ప్రభుత్వం హెచ్‌ఎంఆర్‌ఎల్ నిర్వహణలోకి రావడంతో ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లుగా పాస్‌లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది.
ప్రయాణికులు పెరిగేలా...
ప్రస్తుతం రోజుకు 4.70 లక్షల నుంచి 4.80 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా ప్రయాణికుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. పండుగలు, వరుస సెలవులు, వారాంతాల్లో మాత్రం రద్దీ అనూహ్యంగా నమోదవుతోంది. ఈ క్రమంలో పాస్‌లను ప్రవేశపెట్టడం వల్ల ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడంతోపాటు ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా అవకాశం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రయాణికుల డిమాండ్ మేరకు అదనపు కోచ్‌లను ప్రవేశపెట్టేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు.
ఆర్టీసీలో ఇలా...
ఆర్టీసీలో 7 రకాల పాస్‌లు జారీ అవుతున్నాయి. అన్ని రకాల పాస్‌లు కలిపి 2 లక్షలకుపైగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 24 గంటల ప్రయాణానికి వినియోగించే ట్రావెల్ యాజ్ యూ లైక్ (టీఏవైఎల్) టికెట్లను రోజుకు 80 వేలకుపైగా విక్రయిస్తున్నారు. అలాగే సాధారణ నెలవారీ పాస్‌లు 75 వేలకుపైగా ఉన్నాయి. ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల కోసం వివిధ ధరల్లో వాటిని విక్రయిస్తున్నారు. అలాగే రాయితీలపై సుమారు లక్ష మంది విద్యార్ధులు పాస్‌లను వినియోగిస్తున్నారు. ఆర్టీసీ తరహాలోనే మెట్రో రైళ్లలోనూ పాస్‌లను ప్రవేశపెడితే లక్షన్నర మందికిపైగా ప్రయాణికులు వాటిని వినియోగించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.


