రూ.13,399.71 కోట్ల విలువైన ధాన్యం గల్లంతయితే.. రూ.6,768.97 కోట్ల మేర రికవరీ
2022–23 నాటి బకాయిలే రూ. 3,572 కోట్లు ఇంకా రావాలి
డిఫాల్ట్ మిల్లర్లపై విజిలెన్స్ దాడులు,క్రిమినల్ కేసులు, బ్లాక్‌లిస్టింగ్ తప్పదు
పౌరసరఫరాల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటైన 2014 నుంచి 2025 వరకు రాష్ట్రంలోని మిల్లర్లు ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ ద్వారా అప్పగించాల్సిన రూ.13,399.71 కోట్ల విలువైన 59.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాయం చేశారు. పౌరసరఫరాల శాఖ నయానో, భయానో హెచ్చరికలతో ఇందులో నుంచి 31.73 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యాన్ని, లేదా దానికి సమానమైన మొత్తం విలువ రూ.6,768.97 కోట్లు రికవరీ చేసింది. అయినా ఇంకా మిల్లర్ల నుంచి రూ.6,630.74 కోట్ల విలువైన 28.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వానికి రావాల్సి ఉంది. ఇందులో 2022–23 రబీకి సంబంధించి 15.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటికీ రికవరీ కాలేదు. దాని విలువ ఏకంగా రూ.3,572 కోట్లు. ఇదే సీజన్‌లో ఏకంగా రూ.8,069 కోట్ల విలువైన 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాయం చేస్తే, ప్రభుత్వం రికవరీ సంస్థలను పెట్టి మరీ రూ.4,497 కోట్ల విలువైన 22.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లేదా దానికి సమానమైన నగదును రికవరీ చేసింది. తాజాగా గత ఖరీఫ్‌లో అప్పగించిన సన్నధాన్యం నుంచి కూడా సుమారు రూ.500 కోట్ల విలువైన ధాన్యం మాయం చేయగా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడుల ద్వారా రూ.250 కోట్ల మేర రికవరీ చేశారు.
రికవరీ లోటుపై మంత్రి ఆగ్రహం
మంగళవారం సచివాలయంలో మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2014 నుంచి ఇప్పటి వరకు మిల్లర్లు దోచేసిన రూ.వేలకోట్ల విలువైన ధాన్యం, సీఎంఆర్‌లపై సమీక్షించారు. కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ డీఎస్.చౌహాన్, పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్‌తో పాటు ఇతర ముఖ్యమైన అధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్ రూ.వేలకోట్ల విలువైన ధాన్యం గల్లంతు కావడం, కస్టమ్ మిల్లింగ్ రైస్ దారి మళ్లడంపై తీవ్రంగా స్పందించారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఏ సంవత్సరంలో ఏ సీజన్‌లో ఎంత మొత్తం ధాన్యాన్ని మిల్లర్లు మాయం చేస్తే, ప్రభుత్వం ఎంత మేర రికవరీ చేసిందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి అధికారులకు వివరించారు.
మిల్లర్లు మాయం చేసిన ధాన్యంలో సగానికి పైగా రికవరీ చేయించినప్పటికీ, మిగతా మొత్తాన్ని ఎందుకు వసూలు చేయలేకపోతున్నారని అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ధాన్యాన్ని దారి మళ్లించే, కస్టమ్ మిల్లింగ్ ఒప్పందాలను ఉల్లంఘించే రైస్ మిల్లర్లపై విజిలెన్స్ దాడులు మరింత ముమ్మరం చేస్తామని, అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు బ్లాక్‌లిస్టింగ్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. డిఫాల్ట్ మిల్లర్లకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన పరిమిత గడువు వల్ల ఇప్పటికే గణనీయమైన రికవరీలు జరిగాయని అధికారులు వివరించగా, మిగిలిన ప్రతి కేసును మిల్లర్ వారీగా సమీక్షించి గడువు నిర్ధారిస్తూ ప్రత్యేక రికవరీ కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు.


