source: BCCI X
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే సిరీస్‌కు దూరం కాగా.. తాజాగా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా గాయం కారణంగా తప్పుకున్నాడు.
తొలుత లంక సిరీస్‌కు బుమ్రాతో పాటు సాయి సుదర్శన్‌ను కూడా ఎంపిక చేశారు. వీరిద్దరూ గాయాల నుంచి పూర్తిగా కోలుకుంటారనుకుంటే, అది జరగలేదు. బుమ్రా ఎడమ మోకాలిలో గాయం.. సాయి సుదర్శన్ కాలి బొటనవేలికి గాయం నుంచి కోలుకునేందుకు గత కొంతకాలంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్‌లో ఉన్నారు.
అయితే గాయాలు ఎంతకీ మానకపోవడంతో తొలుత బుమ్రా, తాజాగా సాయి సుదర్శన్ లంక సిరీస్ నుంచి తప్పుకున్నారు. రోజుల వ్యవధిలో ఇద్దరు రెగ్యులర్ ఆటగాళ్లు వైదొలగడం టీమిండియాకు భారీ ఎదురుదెబ్బే అనుకోవాలి. ఇప్పుడు వీరిద్దరికి ప్రత్యామ్నాయాలుగా ఎవరికి ఎంపిక చేస్తారో చూడాలి. తొలి టెస్ట్ (ఆగస్ట్ 15, గాలే) ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది.
లంకలో పరిస్థితులకు అలవాటు పడేందుకు టీమిండియా ప్రస్తుతం ఆ దేశ క్రికెట్ ఎలెవెన్ జట్టుతో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక ఎలెవెన్ జట్టు 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
ఈ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు పెద్దగా ఆకట్టకోలేకపోయారు. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ తలో 2 వికెట్లు తీయగా.. గుర్నూర్ బ్రార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. సీనియర్ పేసర్లు సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. స్పిన్నర్ సరాన్ష్ జైన్ 11 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ దక్కలేదు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ సెంచరీతో (103 రిటైర్డ్ హర్ట్) సత్తా చాటగా.. కేఎల్ రాహుల్ (40) రాణించాడు. యశస్వి జైస్వాల్ డకౌటై నిరాశపర్చగా.. పంత్ (2), జురెల్ (1) కూడా విఫలమయ్యారు. ప్రస్తుతం రెండో రోజు ఆట (టీ విరామం) కొనసాగుతోంది.


