PC: BCCI X
శ్రీలంక ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు. అయితే, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతుండగా.. వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు.
వర్షం వల్ల ఆటకు అంతరాయం
ఫలితంగా శనివారం నాటి రెండో రోజు ఆటలో భోజన విరామ సమయానికి టీమిండియా.. 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 67 పరుగులు చేయగలిగింది. అయితే, అంతకంటే ముందే వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది.
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) తాజా ఎడిషన్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లింది.
హాఫ్ సెంచరీలతో అలరించారు
అయితే, ఈ సిరీస్ సన్నాహకాల్లో భాగంగా శుక్రవారం నుంచి శ్రీలంక ఎలెవన్‌తో టీమిండియా వార్మప్ మ్యాచ్ మొదలుపెట్టింది. కొలంబోలో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని మంచి స్కోరు సాధించింది. ఓపెనర్లు నిశాన్ మధుష్క (66), రవిందు రశాంత (71) అర్ధ శతకాలతో మెరిశారు.
మిగిలిన వారిలో పసిందు సూరియబండారా (35), పవన్ రత్ననాయకె (39), అహాన్ విక్రమసింఘే (31), రమేశ్ మెండిస్ (32) ఫర్వాలేదనిపించారు. వికెట్ కీపర్ అంజాలా బండారా (13) విఫలం కాగా.. కెప్టెన్ సోనాల్ దినుష (52) హాఫ్ సెంచరీతో అలరించాడు.
మనోళ్లు తేలిపోయారు
ఫలితంగా శ్రీలంక ఎలెవన్ 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. పేసర్లంతా తేలిపోయారు. గుర్నూర్ బ్రార్ ఒక్కడు మాత్రం ఒక వికెట్ తీశాడు. ఈ క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 363-8 వద్ద రెండో రోజు శ్రీలంక ఎలెవన్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే జైస్వాల్ వికెట్ కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి మరో ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ 48 బంతుల్లో 23, పడిక్కల్ 52 బంతుల్లో 44 పరుగులతో క్రీజులో నిలిచారు. ఇద్దరూ కలిసి యాభైకి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
పడిక్కల్ ఫిఫ్టీ
ఇక భోజన విరామం తర్వాత కాసేపటికే పడి క్కల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు.. రాహుల్ 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ఇదిలా ఉంటే.. గాయం వల్ల రెగ్యులర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తొలిరోజు మైదానంలో దిగలేదు.


