టీమిండియాతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో శ్రీలంక ఎలెవన్ ఓపెనర్ నిశాన్ మధుష్క దుమ్ములేపాడు. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి వన్డే మాదిరి బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 52 బంతుల్లోనే నిశాన్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
కాగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ సన్నాహకాల్లో భాగంగా శ్రీలంక ఎలెవన్‌తో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ మొదలుపెట్టింది. కొలంబో వేదికగా టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
రనౌట్ కావడంతో....
ఓపెనర్ నిశాన్ మధుష్క భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న అతడు పదకొండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 66 పరుగులు చేశాడు. అతడిని అవుట్ చేసేందుకు భారత పేసర్లు, స్పిన్నర్లు ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు.
అయితే, 21వ ఓవర్లో మానవ్ సుతార్ వేసిన బంతిని ఎదుర్కొని పరుగు తీసే క్రమంలో రవిందు రశాంతతో సమన్వయ లోపం కారణంగా.. నిశాన్ రనౌట్ అయ్యాడు. దీంతో ఎట్టకేలకు భారత్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక మరో ఓపెనర్ రవిందు కూడా నిలకడగా ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 82 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు.
తొలి వికెట్‌కు ఏకంగా 110 పరుగుల భాగస్వామ్యం
నిశాన్ స్థానంలో క్రీజులోకి వచ్చిన వన్‌డౌన్ బ్యాటర్ పసిందు సూరియబండారా కూడా నిలకడగానే ఆడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం నాటి తొలి రోజు ఆటలో భోజన విరామ సమయానికి శ్రీలంక ఎలెవన్ జట్టు 29 ఓవర్లలో వికెట్ నష్టానికి 138 పరుగులు సాధించింది.
రవిందు 50, పసిందు 16 పరుగులతో క్రీజులో నిలిచారు. నిశాన్- రవిందు కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం.
భారత బౌలర్లు విఫలం
భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, రవీంద్ర జడేజా, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్.. ఇలా ఒక్కరు కూడా ప్రభావం చూపలేకపోయారు.
బ్రార్ నాలుగు ఓవర్లలోనే అత్యధికంగా 25 పరుగులు సమర్పించుకోగా.. సుతార్, సిరాజ్ 5 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 14 పరుగులే ఇచ్చి పొదుపు పాటించారు. జడ్డూ 5 ఓవర్లలో 29, కుల్దీప్ 5 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చుకున్నారు. ప్రసిద్ 5 ఓవర్లలో 27 పరుగులు సమర్పించుకున్నాడు.
చదవండి: టీమిండియా-శ్రీలంక ఎలెవన్ మ్యాచ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్


